Uttar Pradesh: రేపే యూపీ నాలుగో దశ.. గెలుపు గుర్రాలను తేల్చేది ఇదే!
- 9 జిల్లాల పరిధిలోని 60 నియోజకవర్గాల్లో ఎన్నికలు
- 57 స్థానాల్లో బీజేపీ పోటీ, 60స్థానాల్లోనూ కాంగ్రెస్, బీఎస్పీ పోటీ
- 58 నియోజకవర్గాల్లో సమాజ్ వాదీ పార్టీ పోటీ
- అవధ్ ప్రాంతం గెలిస్తే.. యూపీని గెలిచినట్టే
దేశవ్యాప్తంగా అమితాసక్తిని రేకెత్తిస్తున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రేపు (బుధవారం) నాలుగో దశ పోలింగ్ జరగనుంది. ఇప్పటికే మూడు దశల పోలింగ్ ముగియగా.. నాలుగో దశ ఎన్నికలు జరగనున్న ప్రాంతం రాష్ట్ర ఎన్నికల ఫలితాలను నిర్ణయించేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని అవధ్ ప్రాంతంలో నాలుగో దశ ఎన్నికలు జరగనున్నాయి. అవధ్ గెలిస్తే.. యూపీని గెలిచినట్టేనన్న నానుడి ఎప్పటి నుంచో ఉంది.
ఈ నాలుగో దశలో 9 జిల్లాల పరిధిలో ఏకంగా 60 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సొంత పార్లమెంట్ నియోజకవర్గం రాయిబరేలీతో పాటు మేనకా గాంధీ కుమారుడు వరుణ్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఫిలిబిత్ కూడా ఉంది.
ఇక రైతులను కారుతో తొక్కించి చంపాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడి తండ్రి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా ప్రాతినిధ్యం వహిస్తున్న లఖింపూర్ ఖేరీలోనూ నాలుగో దశ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా యూపీలో నాలుగో దశ ఎన్నికలు అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
నాలుగో దశలో మొత్తం 60 స్థానాలుండగా.. కాంగ్రెస్, బీఎస్పీ మాత్రమే అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తుండగా, అధికార బీజేపీ 57 స్థానాల్లో, విపక్ష సమాజ్ వాదీ పార్టీ 58 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. 60 స్థానాల బరిలో మొత్తం 624 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు.