BJP: కట్టు తప్పితే వేటు తప్పదు: బండి సంజయ్ హెచ్చరిక
- రెండో దఫా అసమ్మతి నేతల భేటీ
- భేటీపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంజయ్
- అసమ్మతి నేతలను పట్టించుకోవాల్సిన పని లేదని వ్యాఖ్య
- ప్రతి పార్టీలో అసమ్మతి నేతలుంటారంటూ తీసిపారేసిన సంజయ్
బీజేపీ తెలంగాణ శాఖలో అసమ్మతి నేతల భేటీలు అగ్గి రాజేస్తున్నాయి. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు వ్యతిరేకంగా ఇదివరకే ఓ దఫా అసమ్మతి నేతలు భేటీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం కూడా అసమ్మతి నేతలు మరోమారు భేటీ అయ్యారు. ఈ భేటీపై ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్.. అసమ్మతి నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్పిన సంజయ్.. అలాంటి పార్టీలో ఉంటూ కట్టు తప్పి ప్రవర్తించే నేతలపై వేటు వేయడం ఖాయమని హెచ్చరించారు. ప్రతి పార్టీలో అసమ్మతి నేతలంటూ కొందరు ఉంటారని చెప్పిన ఆయన.. వారి గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చేశారు.
అంతేకాకుండా అలాంటి వారి వల్ల పార్టీలకు ప్రయోజనం ఏమీ ఉండదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అసమ్మతి నేతలు వారు పనిచేయకపోవడమే కాకుండా పనిచేసే వారిని పనిచేయనీయకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుంటారని చెప్పారు. తెలంగాణలో అధికారం చేపట్టే దిశగా పార్టీ అడుగులు వేస్తోందని, ఇలాంటి సమయంలో అసమ్మతి అంటూ భేటీలు నిర్వహిస్తే సహించేది లేదని కూడా బండి సంజయ్ హెచ్చరించారు.