KL Rahul: ఓ బాలుడి బోన్ మ్యారో మార్పిడికి ఆర్థిక సాయం చేసిన టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్
- బ్లడ్ క్యాన్సర్ బారినపడిన వరద్ నల్వాడే
- ఎముక మజ్జ మార్పిడి అత్యవసరమన్న వైద్యులు
- తల్లడిల్లిన తల్లిదండ్రులు
- కేఎల్ రాహుల్ కు వివరించిన గివ్ ఇండియా సంస్థ
- రూ.31 లక్షలు అందించిన రాహుల్
మహారాష్ట్రకు చెందిన వరద్ నల్వాడే బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. అతడు ప్రాణాలతో ఉండాలంటే బోన్ మ్యారో (ఎముక మజ్జ) మార్పిడి తప్పనిసరి అని వైద్యులు స్పష్టం చేయడంతో బాలుడి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. నల్వాడే వయసు 11 ఏళ్లు. అతడి తండ్రి సచిన్ నల్వాడో ఓ బీమా కంపెనీలో ఏజెంటుగా పనిచేస్తున్నాడు. తల్లి స్వప్న గృహిణి. తమ బిడ్డకు అంత ఖరీదైన వైద్యం చేయించలేక వరద్ తల్లిదండ్రులు కుమిలిపోయారు.
అయితే వారి బాధను గమనించిన గివ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ ఈ విషయాన్ని టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ కు చేరవేసింది. బాలుడి పరిస్థితి పట్ల కేఎల్ రాహుల్ చలించిపోయాడు. వెంటనే ఆ చిన్నారి బోన్ మ్యారో మార్పిడికి అవసరమైన రూ.31 లక్షలు అందించి తన పెద్ద మనసు చాటుకున్నాడు.
కేఎల్ రాహుల్ ఆర్థికసాయం అనంతరం వరద్ నల్వాడేకి ముంబయిలోని జస్లోక్ ఆసుపత్రిలో ఎముక మజ్జ మార్పిడి చేశారు. ప్రస్తుతం ఆ బాలుడు కోలుకుంటున్నాడు. దీనిపై కేఎల్ రాహుల్ ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. తాను చేసింది చిరుసాయమేనని, ఇది ఎంతోమందికి స్ఫూర్తి కలిగించాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు.
అటు, బాలుడు వరద్ నల్వాడే తల్లి స్వప్న ఆనందం అంతాఇంతా కాదు. అసాధ్యమనుకున్నది కేఎల్ రాహుల్ కారణంగా సాధ్యం కావడంతో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. రాహుల్ వల్లే తమ బిడ్డకు ఖరీదైన వైద్యం చేయించగలిగామని ఆమె వినమ్రంగా వివరించారు.
గివ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ సీఈవో సుమీత్ దయాళ్ కూడా కేఎల్ రాహుల్ ఔదార్యాన్ని వేనోళ్ల కొనియాడారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు కేఎల్ రాహుల్ బాటలో ఎంతోమంది ముందుకు వస్తారని భావిస్తున్నట్టు తెలిపారు. కాగా, సోషల్ మీడియాలో కేఎల్ రాహుల్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. బాలుడి ప్రాణాలను కాపాడిన దేవుడు అంటూ నెటిజన్లు ఆకాశానికెత్తేస్తున్నారు.