Nitish Kumar: బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే నితీశే రాష్ట్రపతి అభ్యర్థి అవుతారు: ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్
- నితీశ్‌కుమార్‌తో ఇటీవల పీకే భేటీ
- బీజేపీపై ఇటీవల బహిరంగంగానే విమర్శలు చేస్తున్న నితీశ్
- జాతీయ రాజకీయాల్లో చర్చ
బీజేపీతో కనుక సంబంధాలు తెంచుకుంటే కనుక బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తామని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తొలుత ఆయన బీజేపీతో సంబంధాలు తెంచుకుంటే ఆ తర్వాత ఆయన పేరును ప్రకటించాలా? వద్దా? అన్న విషయాన్ని చర్చిస్తామని అన్నారు.
ఇదిలావుంచితే, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇటీవల నితీశ్ కుమార్ తో భేటీ అయ్యారు. అయితే, ఈ సమావేశానికి ఎలాంటి ప్రాధాన్యం లేదని నితీశ్ స్పష్టం చేసినప్పటికీ, ప్రతిపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై చర్చించేందుకే ఈ భేటీ జరిగినట్టు చెబుతున్నారు.
బీహార్ అసెంబ్లీకి జరిగిన గత ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ నితీశ్‌కే ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించారు. అయితే, ఇటీవల నితీశ్ బీజేపీపై బహిరంగంగానే విమర్శలు చేస్తుండడంతో బీజేపీతో ఆయనకు చెడిందన్న ఊహాగానాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు పీకేతో భేటీ కావడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.