Pakistan: భారత్-పాక్ మధ్య సమస్యల పరిష్కారానికి పాక్ ప్రధాని ఆసక్తి.. మోదీతో టీవీ చర్చలకు రెడీ అన్న ఇమ్రాన్
- సమస్యలను పరిష్కరిస్తే కోట్లాది మంది ప్రజలకు ప్రయోజనమన్న ఇమ్రాన్
- పాక్‌తో చర్చల విషయమై తన వైఖరిని ఇప్పటికే స్పష్టం చేసిన భారత్
- రెండు దశాబ్దాల తర్వాత రష్యా పర్యటనకు వెళ్తున్న ఇమ్రాన్
భారత్-పాకిస్థాన్ మధ్య ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముందుకొచ్చారు. భారత ప్రధాని నరేంద్రమోదీతో టీవీ చర్చలకు ఆసక్తి చూపించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా పర్యటనకు వెళ్లడానికి ముందు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇమ్రాన్.. చర్చల ద్వారా కనుక సమస్యలను పరిష్కరించుకోగలిగితే ఉపఖండంలోని కోట్లాది మంది ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు.
ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్న ప్రస్తుత సమయంలో ఇమ్రాన్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే, చర్చల విషయంలో భారత్ తన స్పష్టమైన వైఖరిని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. ఉగ్రవాదం, చర్చలు ఒకదానికొకటి కలిసి సాగలేవని తేల్చి చెప్పింది. కాగా, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రష్యాలో పర్యటించనున్న పాక్ నేతగా గుర్తింపు తెచ్చుకుంటున్న ఇమ్రాన్ మాట్లాడుతూ.. అన్ని దేశాలతోనూ వాణిజ్య సంబంధాలు కలిగి ఉండాలనే తాము కోరుకుంటున్నామని అన్నారు.
భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు మారడంతో వాణిజ్యం కూడా తగ్గిపోయిందని ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ సంక్షోభంపై మాట్లాడుతూ.. ఇది తమకు సంబంధించిన విషయం కాదన్నారు. రష్యాతో తమకు ఇప్పటికే ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా పర్యటనకు వెళ్తున్నట్టు చెప్పారు. తమ దేశానికి ఆర్థిక సహకారంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఇమ్రాన్ సమావేశమవుతారు.