Andhra Pradesh: ఏపీలో కరెంటు కోతలని రాస్తే పరువునష్టం దావా తప్పదు: ఇంధనశాఖ కార్యదర్శి హెచ్చరిక
- నిరంతరాయంగా విద్యుత్ అందిస్తున్నాం
- వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ ఇస్తున్నాం
- ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశాం
- ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు కోతలంటూ పత్రికల్లో వస్తున్న కథనాలపై ఏపీ ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఇకపై ఇలాంటి వార్తలు కనిపిస్తే పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యుత్‌ను నిరంతరాయంగా అందిస్తున్నామని, వ్యవసాయానికి కూడా తొమ్మిది గంటలపాటు విద్యుత్‌ను అందిస్తున్నట్టు చెప్పారు. అయినప్పటికీ పత్రికల్లో విద్యుత్ కోతలంటూ వార్తలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని, ఈ విషయాన్ని పలుమార్లు విలేకరుల సమావేశంలో చెప్పినప్పటికీ పదేపదే అలాంటి వార్తలు వస్తున్నాయని అన్నారు. ప్రజల్లో అపోహలు కలిగించడంతోపాటు ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఏపీలో విద్యుత్ కోతలంటూ మరోమారు వార్తలు కనిపిస్తే పరువునష్టం దావా ఎదుర్కోవాల్సి ఉంటుందని శ్రీకాంత్ హెచ్చరించారు.