Virat Kohli: కోహ్లీ సూపర్ హ్యూమన్.. ధోనీ కూల్ మ్యాన్: షేన్ వాట్సన్
- నాయకుడిగా కోహ్లీ అద్భుతాలు
- సహచరులను ప్రోత్సహించడం తెలుసు
- ధోనీ జట్టు ఒత్తిడిని అంతా తీసేసుకుంటాడు
- ఆటగాళ్ల పట్ల పూర్తి విశ్వాసం ఉంచుతాడు
- రోహిత్ బ్యాటింగ్ ఎంతో ఇష్టమన్న వాట్సన్
ఇద్దరు భారత క్రికెట్ దిగ్గజాలను ఆస్ట్రేలియా జట్టు మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ఎంతగానో మెచ్చుకున్నాడు. వారి వ్యక్తిత్వాలకు నూరు మార్కులు వేశాడు. షేన్ వాట్సన్ కు ఐపీఎల్ లో ఇద్దరితో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుతో, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతోనూ ఆడాడు. దాంతో కోహ్లీ, ధోనీలతో సన్నిహితంగా పనిచేసే అవకాశం అతడికి లభించింది.
‘‘తన సహచర ఆటగాళ్లను ప్రోత్సహించే విషయంలో విరాట్ ఓ నాయకుడిగా అద్భుతాలు చూపించాడు. ప్రతీ ఆటకు అధిక అంచనాలతో వస్తాడు. నా వరకు నేను విరాట్ ను సూపర్ హ్యూమన్ (గొప్ప వ్యక్తి) గా భావిస్తాను. తన చుట్టూ ఉన్న వారిని ఎలా ప్రోత్సహించాలో తెలిసిన వాడు. ఎంతో స్థిరమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అతడికి ఉన్న జ్ఞానం మనోహరం. విరాట్ తో కలసి ఆర్సీబీలో పనిచేయడం నాకు గొప్ప అనుభవం.
ఎంఎస్ ధోనీ రక్తనాళాల్లో ఐస్ (చల్లదనం) ప్రవహిస్తుంటుంది. జట్టు నుంచి ఒత్తిడిని తీసేసుకుంటాడు. తన ఆటగాళ్లను పూర్తిగా నమ్ముతాడు. ప్రతి ఒక్క ఆటగాడు అతడి శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంచేలా చేయగలడు. తనకు, తన చుట్టూ ఉన్న వారికి ఏది చేస్తే ఫలితం వస్తుందో తెలుసు. ఆటగాళ్లు కావాల్సింది చేస్తారని విశ్వాసం ఉంచుతాడు’’ అని వాట్సాన్ తన విశ్లేషణను ఐసీసీ సమీక్షలో భాగంగా తెలిపాడు.
ప్రస్తుత టీమిండియా జట్టు కెప్టెన్, ముంబై ఇండియన్స్ ఐపీఎల్ జట్టు కెప్టెన్ అయిన రోహిత్ శర్మ గురించి కూడా వాట్సన్ మాట్లాడాడు. అతడు తన పనిని చాలా అద్భుతంగా చేస్తాడని కొనియాడాడు. జట్లకు నాయకత్వం వహించిన అనుభవం ఉందన్నాడు. రోహిత్ బ్యాటింగ్ చేస్తుంటే చూడడం ఇష్టమని చెప్పాడు.