Mayawati: యూపీ 4వ దశ పోలింగ్ ప్రారంభం.. ఓటు వేసిన మాయావతి
- నేడు 9 జిల్లాల్లో పోలింగ్
- పోటీలో మొత్తం 624 మంది అభ్యర్థులు
- మార్చి 10న ఫలితాలు
ఉత్తరప్రదేశ్ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. నేడు ఫిలిబిత్, లఖీంపుర్ ఖేరీ, సీతాపుర్, హర్దోయ్, ఉన్నావ్, లక్నో, రాయ్ బరేలీ, బాందా, ఫతేపుర్ జిల్లాల పరిధిలోని 59 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 624 మంది అభ్యర్థులు ఈ పోటీలో నిలిచారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. లక్నోలోని మున్సిపల్ నర్సరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆమె ఓటు వేశారు.
నేడు ఎన్నికలు జరుగుతున్న 59 స్థానాల్లో 2017లో బీజేపీ 51, ఎస్పీ 4, బీఎస్పీ 3, అప్నాదళ్ ఒకచోట గెలుపొందాయి. ఈ ఎన్నికల బరిలో యూపీ మంత్రులు బ్రిజేశ్ పాఠక్, అశుతోశ్ టాండన్ తో పాటు యూపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నితిన్ అగర్వాల్, ఈడీ మాజీ అధికారి రాజేశ్వర్ సింగ్ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మొత్తం 7 దశల్లో జరుగుతున్నాయి. మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తారు.