Shashi Tharoor: మా యాంకర్లు.. టీఆర్పీ రేటింగ్ ల కోసం మూడో ప్రపంచ యుద్ధాన్ని రాజేయగలరు: శశి థరూర్
- పరస్పర యుద్ధం కంటే చర్చలు నయమే
- కానీ టీవీ చర్చల్లో పరిష్కారమైన అంశాలు లేవు
- సమస్యలు ఇంకా పెరుగుతాయి
- మోదీతో టీవీ చర్చపై ఇమ్రాన్ వ్యాఖ్యకు శశి స్పందన
ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించుకునేందుకు భారత ప్రధాని మోదీతో టీవీ చర్చను తాను కోరుకుంటున్నట్టు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భిన్నంగా స్పందించారు. ఇందుకు సంబంధించి తన అభిప్రాయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
‘‘డియర్ ఇమ్రాన్ ఖాన్, పరస్పర యుద్ధం కంటే సుదీర్ఘమైన చర్చలు మంచివేనని నేను అంగీకరిస్తాను. కానీ ఇప్పటి వరకు టెలివిజన్ చర్చా కార్యక్రమాలతో పరిష్కారమైన అంశాలు లేవు. అవి ఇంకా పెరిగిపోతాయి. తమ టీఆర్పీ రేటింగ్ లు పెరుగుతాయని అనుకుంటే మా యాంకర్లలో కొందరు మూడో ప్రపంచ యుద్ధాన్ని రాజేయడానికి కూడా వెనుకాడరు’’ అని ట్వీట్ లో పేర్కొన్నారు. అలా టీవీ కార్యక్రమాలతో సాధించేది ఏమీ లేదని పరోక్షంగా స్పష్టం చేసినట్టయింది.
చర్చల ద్వారా విభేదాలు పరిష్కారమైతే ఉపఖండంలోని వంద కోట్లకు పైగా ప్రజలకు మంచి జరుగుతుందని ఇమ్రాన్ ఖాన్ రష్యా ప్రభుత్వ టెలివిజన్ నెట్ వర్క్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా పేర్కొనడం గమనార్హం. మరోపక్క, రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇమ్రాన్ ఖాన్ మాస్కో చేరుకున్నారు. రెండు దశాబ్దాల కాలంలో రష్యాకు వచ్చిన తొలి పాక్ ప్రధానిగా చరిత్ర సృష్టించారు. పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చలు నిర్వహించనున్నారు.