Russia: ఉక్రెయిన్-రష్యా పోరుతో మన దగ్గర ధరలు పెరిగేవి వీటికే..!
- చమురు ధరలకు రెక్కలు
- ఎల్పీజీ, సీఎన్జీ ధరల మంట
- గోధుమ సరఫరాపై ప్రభావం
- రష్యా, ఉక్రెయిన్ లో భారీగా గోధుమ ఉత్పత్తి
- వేడెక్కనున్న వంట నూనెలు
ఉక్రెయిన్ - రష్యా మధ్య నెలకొన్న సంక్షోభంతో మన దేశంలో సామాన్యులకు సమస్యలు ఎదురుకానున్నాయి. ఉక్రెయిన్ కు మన దేశం నుంచి ఔషధాలు ఎగుమతి అవుతుంటే, ఆ దేశం నుంచి వంట నూనెలను దిగుమతి చేసుకుంటున్నాం. మరోవైపు ఇంధన మార్కెట్లో రష్యా పాత్ర కీలకం. చమురు, గ్యాస్ ను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తుంటుంది.
ఉక్రెయిన్ పై రష్యా ఏకపక్ష చర్యలను ఖండిస్తూ అమెరికా, బ్రిటన్ ఇప్పటికే ఆంక్షలను ప్రకటించాయి. ఐరోపా యూనియన్ కూడా ఆంక్షలు విధించనుంది. దీంతో ఇంధన సరఫరాపై ప్రభావం పడుతుంది. చమురు బ్యారెల్ ధర ఇప్పటికే 96.7 డాలర్లకు చేరుకుంది. ఇది 105-110 డాలర్లకు వెళుతుందన్న అంచనాలున్నాయి. ప్రస్తుతం మన దేశంలో పెట్రోల్ లీటర్ ధర రూ.108 స్థాయిలో ఉంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా చమురు కంపెనీలు ధరలను పెంచడం లేదు. మార్చి 10 తర్వాత ఎప్పుడైనా ధరలను పెంచొచ్చు. చివరిగా బ్యారెల్ 83 డాలర్ల వద్ద ఉన్నప్పుడు రేట్ల సవరణ జరిగింది. అంటే ఏ మేరకు పెట్రోల్, డీజిల్ ధర పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. జేపీ మోర్గాన్ అయితే బ్యారెల్ చమురు 150 డాలర్లకు పెరిగిపోవచ్చని చెబుతోంది. ఇదే జరిగితే మన దేశ జీడీపీపై గణనీయమైన ప్రభావం పడుతుంది. కేంద్రం కొంత భరించినా, ధరలు మరింత పెరిగిపోతాయి.
ఇళ్లల్లో వినియోగించే వంటగ్యాస్ సిలిండర్ ధర ఇప్పటికే రూ.1,000కు సమీపించగా, ఇది మరో రూ.100 వరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. వాణిజ్య అవసరాలకు వినియోగించే సీఎన్జీ, పీఎన్జీ ధరలకూ రెక్కలు వస్తాయి.
అలాగే గోధుమ ధరలు కూడా పెరుగుతాయి. రష్యా ప్రపంచంలో అతిపెద్ద గోధుమ ఎగుమతిదారుగా ఉంటే, ఉక్రెయిన్ నాలుగో అతిపెద్ద గోధుమ ఎగుమతి దేశంగా ఉంది. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం గోధుమ సరఫరాలపై పడి, ధరలు పెరిగేందుకు దారితీస్తుంది.
ఉక్రెయిన్ నుంచి సన్ ఫ్లవర్ ఆయిల్ ను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. కనుక వంట నూనెలు కూడా ప్రభావితమవుతాయి. ఇంకా అల్యూమినియం, మెటల్స్ ధరలు కూడా పెరగొచ్చన్న అంచనాలున్నాయి. ముఖ్యంగా బంగారం ధర కూడా కొండెక్కనుంది. యుద్ధం వంటి అనిశ్చిత పరిస్థితుల్లో బంగారానికి డిమాండ్ ఏర్పడడం సహజమే!