Hyderabad: పెండింగ్ చలాన్ల వసూలుకు హైదరాబాద్ పోలీసుల కొత్త ప్రయోగం
- హైదరాబాద్ పరిధిలో రూ.600 కోట్ల చలాన్లు పెండింగ్
- వసూలుకు రిబేట్ మంత్రాన్ని ప్రకటించిన పోలీసులు
- బైక్‌కు 75 శాతం, కార్లకు 50 శాతం రిబేట్
కారో, బైకో తీసుకుని రోడ్డెక్కితే ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్న ఇంగిత జ్ఞానం లేకుండా రయ్యిమని దూసుకుపోతుంటారు కొందరు. అలాంటి వారిని కనిపెట్టి.. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఫైన్ వేస్తుంటారు ట్రాఫిక్ పోలీసులు. అయితే ఆ ఫైన్లను ఎంతమంది విధిగా చెల్లిస్తున్నారు? గతంలో అయితే బండిని పక్కన పెట్టించి ఫైన్ కట్టాక గానీ వదిలేవారు కాదు పోలీసులు.
అయితే ఇప్పుడంతా ఆన్‌లైన్ కదా. బండి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే.. అలా ఫొటో తీసేసి.. ఇలా ఆ బండి యజమాని మొబైల్‌కు చలాన్ పంపుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. అయితే ఆ చలాన్లకు సంబంధించి ఏ మేర వసూలు అవుతోందన్న విషయంపై మాత్రం ఇప్పటిదాకా హైదరాబాదు నగర పోలీసులు దృష్టి పెట్టినట్టు లేరు.
ఈ క్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టాక.. దీనిపై ఓ సమీక్ష జరిగినట్లు సమాచారం. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఏకంగా రూ.600 కోట్ల మేర చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయట. ఇంత పెద్ద ఎత్తున పేరుకుపోయిన చలాన్లను వసూలు చేయడం ఎలా? అన్న విషయంపై కూడా సమాలోచనలు జరగ్గా.. రిబేట్ ఇస్తే తప్పించి ఈ భారీ మొత్తాన్ని వసూలు చేయడం సాధ్యం కాదని తేలిపోయిందట. దీంతో రిబేట్ మంత్రాన్ని ట్రాఫిక్ పోలీసులు అందుకున్నారు.
పెండింగ్‌లో ఉన్న చలాన్ల సొమ్మును చెల్లించే వారికి రిబేట్ ఇస్తామంటూ ఇప్పుడు తెలంగాణ పోలీసు శాఖ ప్రకటించింది. తోపుడు బండ్లు అయితే కేవలం 20 శాతం చెల్లిస్తే.. 80 శాతం రిబేట్ ఇస్తారట. బైక్‌లకు అయితే 25 శాతం చెల్లిస్తే.. 75 శాతం రిబేట్ ఇస్తారట. ఇక ఆర్టీసీ బస్సులు అయితే 30 శాతం కడితే 70 శాతం రిబేట్ ఇస్తారట. కార్లు అయితే 50 శాతం కడితే మిగిలిన 50 శాతాన్ని రిబేట్ ఇస్తారట. ఈ మేరకు తెలంగాణ పోలీసు శాఖ నుంచి బుధవారం ఓ ప్రకటన వెలువడింది.