Ayyanna Patrudu: అయ్యన్న ఇంటికి మళ్లీ పోలీసులు.. నర్సీపట్నంలో హైటెన్షన్
- ఉదయం నోటీసులు ఇచ్చి వెళ్లిన నల్లజర్ల పోలీసులు
- తాజాగా రాత్రి వేళ మళ్లీ అయ్యన్న ఇంటికి రాక
- అయ్యన్నను అరెస్ట్ చేయడానికే వచ్చారంటున్న టీడీపీ శ్రేణులు
- భారీగా అయ్యన్న ఇంటి వద్దకు చేరుకుంటున్న అనుచరులు
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి వద్ద మరోమారు హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను దూషించారనే ఆరోపణలతో పశ్చిమ గోదావరి జల్లా నల్లజర్ల పోలీసులు అయ్యన్నపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నల్లజర్లలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ తర్వాత జరిగిన సభలో జగన్ ను అయ్యన్న దూషించారంటూ ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలోని అయ్యన్న పాత్రుడి ఇంటి వద్దకు ఈ రోజు ఉదయం నల్లజర్ల పోలీసులు వచ్చారు. అయితే ఆ సమయంలో అయ్యన్న ఇంటిలో లేరని ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. తామేమీ అయ్యన్నను అరెస్ట్ చేయడానికి రాలేదని, కేవలం నోటీసులు ఇచ్చేందుకు మాత్రమే వచ్చామని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు అయ్యన్న కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేసిన పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
తాజాగా కాసేపటి క్రితం మరోమారు నల్లజర్ల పోలీసులు నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటికి వచ్చారు. దీంతో అయ్యన్నను అరెస్ట్ చేసేందుకే నల్లజర్ల పోలీసులు వచ్చారన్న భావనతో అయ్యన్న అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. ఉదయం నోటీసులు ఇచ్చాక.. ఇప్పుడు మళ్లీ ఏం అవసరం ఉందని పోలీసులు అయ్యన్న ఇంటికి వస్తారని ఆయన మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా సమయం గడిచేకొద్దీ అక్కడికి చేరుకుంటున్న టీడీపీ శ్రేణుల సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే పోలీసులు తన ఇంటికి చేరుకున్న సమయంలో అయ్యన్న ఇంటిలో ఉన్నారా? లేదా? అన్న విషయం తెలియరాలేదు.