bheemla naik: భీమ్లా నాయక్ విడుదల నేపథ్యంలో ఏపీలో ఆంక్షలు
- 25న భీమ్లా నాయక్ విడుదల
- కొన్ని థియేటర్లకు ఏపీ ప్రభుత్వం నోటీసులు
- బెనిఫిట్ షోలు, అదనపు షోలు వేయరాదని సూచన
- టికెట్ల రేట్లు కూడా నిబంధనలకు లోబడే ఉండాలని వెల్లడి
- రెవెన్యూ అధికారుల నిఘా ఉంటుందని వార్నింగ్
టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్ చిత్రం ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు తెలంగాణలో ఐదు షోల ప్రదర్శనకు టీఆర్ఎస్ సర్కారు ఇప్పటికే అనుమతి ఇచ్చేసింది. అయితే ఏపీలో మాత్రం ఈ చిత్రానికి ఎలాంటి ప్రోత్సాహకాలు దక్కకపోగా.. ఆంక్షలు అమల్లోకి వచ్చేశాయి. భీమ్లా నాయక్ చిత్రం విడుదల నేపథ్యంలో ఏపీలోని పలు సినిమా థియేటర్లకు వైసీపీ సర్కారు ముందస్తు నోటీసులు జారీ చేసింది.
బెనిఫిట్ షోలు, అదనపు షోలు వేయడానికి వీల్లేదని సదరు నోటీసుల్లో ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. టికెట్ల ధరలు కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు ఉండాలని సూచించింది. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని కూడా ఆ నోటీసుల్లో థియేటర్ల యాజమాన్యాలను హెచ్చరించింది. అంతేకాకుండా ఆయా థియేటర్ల వద్ద రెవెన్యూ అధికారుల నిఘా ఉంటుందని కూడా తెలిపింది.