nawab malik: ఈడీ కస్టడీకి మహారాష్ట్ర మంత్రి మాలిక్
- ఉదయం అరెస్ట్.. రాత్రికి కస్టడీకి మాలిక్
- దావూద్‌తో సంబంధాలు, మనీ ల్యాండరింగ్ ఆరోపణలు
- మార్చి 3 వరకు ఈడీ కస్టడీలోనే మాలిక్
ముంబై బాంబు పేలుళ్ల మాస్టర్ మైండ్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు, మనీ ల్యాండరింగ్ ఆరోపణల కింద అరెస్టైన ఎన్సీపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన కస్టడీలోకి తీసుకుంది. బుధవారం ఉదయమే మాలిక్‌ను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఆయనను కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత మాలిక్‌ను తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరారు. ఈడీ అభ్యర్థన మేరకు కోర్టు కూడా మాలిక్ ను ఈడీ కస్టడీకి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కోర్టు ఆదేశాల మేరకు మాలిక్ ను ఈడీ అధికారులు మార్చి 3వ తేదీ వరకు తమ కస్టడీలో ఉంచుకోనున్నారు. దావూద్‌తో సంబంధాలపై కూపీ లాగడంతో పాటు మనీ ల్యాండరింగ్ వ్యవహారాలపైనా మాలిక్ ను ఈడీ అధికారులు సుధీర్ఘంగా ప్రశ్నించనున్నట్లుగా సమాచారం. మాలిక్ అరెస్ట్‌తో ఇప్పటికే మహారాష్ట్రలో పెను కలకలం రేగగా.. ఇప్పుడు ఆయనను ఈడీ తన కస్టడీలోకి తీసుకోవడంతో అటు ఎన్సీపీతో పాటు ఇటు ఆ పార్టీ మిత్రపక్షం, మహారాష్ట్రలో అధికార పార్టీ శివసేన కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి.