Varla Ramaiah: ఈ ఒక్క సినిమా విడుదల పట్ల ఏపీ సర్కారు ఎందుకంత కఠినంగా వ్యవహరిస్తోంది?: వర్ల రామయ్య
- ‘భీమ్లా నాయక్’ సినిమాపై ఆంక్షలు ఎందుకు?
- ఐదు షోలు వెయ్యకూడదంటూ సినిమా హాళ్లకు నోటీసులు
- ఆ సినిమా ఎవరూ చూడకూడదని కూడా ఆదేశాలిస్తారేమో!
- రైతులు, దళితులు, మహిళల సమస్యలు మాత్రం పట్టవు అని వర్ల ఆగ్రహం
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా రేపు విడుదల అవుతుండడంతో ఏపీ ప్రభుత్వం థియేటర్లకు పలు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. బెనిఫిట్ షోలు, అదనపు షోలు వేయడానికి వీల్లేదని, టికెట్ల ధరలు కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు ఉండాలని నోటీసులు పంపింది. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఈ చర్యలకు దిగుతోందని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు.
ఒక్క సినిమా విడుదల పట్ల రాష్ట్ర సర్కారు ఎందుకంత కఠినంగా వ్యవహరిస్తోందని ఆయన ప్రశ్నించారు. ఐదు షోలు వెయ్యకూడదంటూ సినిమా హాళ్లకు నోటీసులిస్తున్నారని ఆయన అన్నారు. ఆ సినిమా ఎవరూ చూడకూడదని కూడా ఆదేశాలిస్తారేమో! అంటూ ఆయన చురకలంటించారు. రైతులు, దళితులు, మహిళల సమస్యలు ప్రభుత్వానికి పట్టవని, కానీ ఆ సినిమా మాత్రం పెద్ద సమస్య అయిందా? అని నిలదీశారు.