Somireddy Chandra Mohan Reddy: పవన్ కల్యాణ్ ఎవర్ గ్రీన్ హీరో... ఆయనను మీరేం చేయగలరు జగన్?: సోమిరెడ్డి
- విడుదలకు సిద్ధమైన భీమ్లా నాయక్
- పవన్ సినిమాను ఏమీ చేయలేరన్న సోమిరెడ్డి
- విశాల దృక్పథంతో ఆలోచించాలని హితవు
ఏపీ సీఎం జగన్ రాష్ట్ర భవిష్యత్తుపై దృష్టి పెట్టకుండా పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాను దెబ్బతీయడంపై శ్రద్ధ చూపుతున్నారని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
"రాష్ట్రంలో అభివృద్ధి, వ్యవసాయరంగం, నీటి పారుదల రంగం వంటి అంశాలపై దృష్టి పెట్టయ్యా! భీమ్లా నాయక్ కి షోలు ఎట్లా కట్ చేయాలి, పవన్ కల్యాణ్ హీరో కాబట్టి ఆ సినిమా రిలీజై నష్టాలు వచ్చేంతవరకు సినిమా టికెట్ల ధరల పెంపు లబ్ది కలుగచేయకూడదని భావిస్తున్నట్టున్నారు. అసలు మీరేం చేయగలరు? పవన్ కల్యాణ్ ను హీరో కాకుండా హీరోయిన్ ని చేయగలరా? పవన్ కల్యాణ్ ఎవర్ గ్రీన్ హీరో. ఆయననేం చేయలేరు.
ఇలాంటి చిన్న చిన్న అంశాలతో రాష్ట్రం ఎటువైపు వెళుతుందో అర్థంకావడంలేదు. భారతదేశంలో సినిమా రంగం జోలికి వచ్చినవాళ్లు ఎవరూ లేరు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతటివాడు కూడా తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచస్థాయికి ఎదిగిందని ఆకాశానికెత్తేశారు. మరోవైపు తెలుగు చిత్రసీమ నుంచి పాన్ ఇండియా సినిమాలు వస్తుంటే, మీరు సినిమా రంగాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తున్నారు.
కనీసం చిరంజీవి వంటి మెగాస్టార్ రెండు చేతులు జోడించి ప్రాధేయపడుతూ అడిగితే మీ మనసు కరగలేదంటే ఇది కచ్చితంగా కక్షసాధింపు చర్యే. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇప్పటికే రాష్ట్రం నాశనం అయిపోయింది. ఇప్పటికైనా విశాల దృక్పథంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి" అని సోమిరెడ్డి హితవు పలికారు.