Ukraine: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం.. ఇప్పటిదాకా నష్టం ఎంతంటే..!
- 40 మంది ఉక్రెయిన్ సైనికులు,.10 మంది పౌరుల మృతి
- ఉక్రెయిన్‌లో 2 ఎయిర్ పోర్టులు, 70 సైనిక స్థావరాల ధ్వంసం
- ఉక్రెయిన్ దాడుల్లో 10 రష్యా ఫైటర్ జెట్ల ధ్వంసం
మాటల వరకే పరిమితం అవుతుందనుకున్న రష్యా, ఉక్రెయిన్ల మధ్య వివాదం ఏకంగా యుద్ధానికే దారితీసింది. ఉక్రెయిన్‌పై మిలిటరీ ఆపరేషన్ పేరిట గురువారం రష్యా తన యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. చూస్తుండగానే మిలిటరీ ఆపరేషన్ కాస్తా..యుద్ధంగా మారిపోయింది. ఇదే విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ప్రకటించారు. తమ దేశంపై రష్యా సాగిస్తున్నది యుద్ధమేనని ఆయన సంచలన ప్రకటన చేశారు.
గురువారం ఉదయం నుంచి రష్యా రెండు పర్యాయాలు తన ఫైటర్ జెట్లతో ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో జరిగిన నష్టానికి సంబంధించి ఇప్పుడిప్పుడే వివరాలు వెల్లడవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం రష్యా బాంబు దాడుల్లో ఉక్రెయిన్‌కు చెందిన 40 మంది సైనికులు చనిపోయారు. వీరితో పాటు మరో 10 మంది సామాన్య ప్రజలు కూడా మృతి చెందినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.
ఇక రష్యా భీకర దాడులను తిప్పికొట్టే క్రమంలో తమ సైనికులు రష్యాకు చెందిన 10 ఫైటర్ జెట్లను కూల్చేశారని ఉక్రెయిన్ వెల్లడించింది. ఇదిలా ఉంటే తమ దాడుల్లో ఉక్రెయిన్‌కు చెందిన రెండు ఎయిర్‌పోర్టులను ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది. అంతేకాకుండా ఉక్రెయిన్‌కు చెందిన 70 సైనిక స్థావరాలను కూడా ధ్వంసం చేసినట్లు రష్యా తెలిపింది.