Ukraine: నియంతలా పుతిన్.. ఎంతకైనా తెగిస్తామని వార్నింగ్
- ఉక్రెయిన్ మిలిటరీ బేస్‌లతో పాటు జనావాసాలపైనా బాంబులు
- అంతర్జాతీయ సమాజం జోక్యం కూడదని వార్నింగ్
- దాడులు ఆపాలన్న నాటో విజ్ఞప్తికి తిరస్కరణ
ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిజంగానే నియంతలా వ్యవహరిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌తో నెలకొన్న విభేదాల పరిష్కారం కోసం అంటూ రంగంలోకి దిగిన పుతిన్.. ఉక్రెయిన్‌పై యుద్ధం చేసేందుకే మొగ్గు చూపారు.
అంతర్జాతీయ సమాజం సంయమనం పాటించాలంటూ ఎప్పటికప్పుడు చేసిన విజ్ఞప్తులను ఉక్రెయిన్ ఆలకించినా.. రష్యా మాత్రం పెడచెవిన పెట్టిందనే చెప్పక తప్పదు. తాజా పరిస్థితులను చూస్తుంటే.. రష్యా అధ్యక్షుడు పుతిన్ నిజంగానే నియంతలా వ్యవహరిస్తున్నారని చెప్పచ్చు.
గురువారం ఉదయం ఉక్రెయిన్‌పై మిలిటరీ ఆపరేషన్‌కు దిగుతున్నామని చెప్పిన పుతిన్.. మిలిటరీ ఆపరేషన్‌ను కాస్తా యుద్దంగా మార్చేశారు. ఉక్రెయిన్ మిలిటరీ బేస్‌లనే లక్ష్యంగా చేసుకున్నామని చెబుతూనే ఉక్రెయిన్‌లోని జనావాసాలపైనా రష్యా బాంబుల వర్షం కురిపించింది.
ఈ తరహా పరిస్థితిపై నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) రష్యాను నిలువరించే యత్నం చేసింది. దీనికి పుతిన్ తనదైన శైలిలో నియంత స్వరం వినిపించారు. అంతర్జాతీయ సమాజం తమ విషయంలో జోక్యం చేసుకోరాదని ప్రకటించారు. ఒకవేళ తమ మాటను కాదని అంతర్జాతీయ సమాజం ఈ విషయంలో జోక్యం చేసుకుంటే తాము ఎంతకైనా తెగిస్తామని సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటనతోనే పుతిన్ ఓ నియంతలా మారిపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి.