Russia: ఉక్రెయిన్ పై యుద్ధం ఆపాలంటూ రష్యాలో నిరసనలు.. నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతున్న రష్యా!
- ఉక్రెయిన్ పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న రష్యన్లు
- అంతర్గత సమస్యల నుంచి దృష్టిని మరల్చడానికే యుద్ధం చేస్తున్నారంటున్న నిరసనకారులు
- 1,400 మంది నిరసనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు
ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపాలంటూ ప్రపంచ దేశాలన్నీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ను కోరుతున్న సంగతి తెలిసిందే. తొలి రోజు యుద్ధంలో ఉక్రెయిన్ భారీగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని చవిచూసింది. బాంబులు, మిస్సైల్స్ దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.
మరోవైపు ఉక్రెయిన్ పై యుద్ధాన్ని తక్షణమే ఆపాలంటూ స్వదేశంలో కూడా రష్యాకు నిరసన ఎదురవుతోంది. మాస్కోతో పాటు దేశంలోని పలు నగరాల్లో నిరసనకారులు రోడ్లెక్కారు. 'నో టు వార్', 'స్టాప్ వార్', 'పుతిన్ లైస్' అంటూ నినదిస్తున్నారు.
మరోవైపు నిరసనకారులపై రష్యా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. దాదాపు 1,400 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని 51 నగరాల్లోని జైళ్లలో ఉంచారు. అరెస్టైన వారిలో 700కు పైగా నిరసనకారులు మాస్కోకు చెందిన వారు కాగా, దాదాపు 340 మంది దేశంలో రెండో పెద్ద నగరమైన సెయింట్ పీటర్స్ బర్గ్ కు చెందినవారు.
దేశంలో అంతర్గతంగా ఉన్న తీవ్ర సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఉక్రెయిన్ పై పుతిన్ యుద్ధం చేస్తున్నారని ఒక నిరసనకారుడు ఆరోపించాడు. మీడియాకు చెందిన ఒక వ్యక్తి మాట్లాడుతూ, ఒక హంతకుడు ఇచ్చే డబ్బును తీసుకుని అతనికి అనుకూలంగా పని చేయలేమని పుతిన్ ని ఉద్దేశించి అన్నారు. ఈ యుద్ధం వల్ల రష్యా అనేక వ్యతిరేక పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మరొకరు అభిప్రాయపడ్డారు.
తొలి నుంచి కూడా ప్రతిపక్ష నేతలు, నిరసనకారులపై పుతిన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూనే ఉంది. వారిని హత్య చేయడమో, జైళ్లలో పెట్టడమో, లేదా దేశం నుంచి బహిష్కరించడమో చేస్తోంది. ఇప్పటికే ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీ రెండున్నరేళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఎంతో మంది ఆచూకీ లేకుండా పోయారు.