Joe Biden: భార‌త్‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నాం.. ర‌ష్యా సైబ‌ర్ దాడిని కూడా ఎదుర్కొనేందుకు సిద్ధం: జో బైడెన్

biden on afghan situation

  • ర‌ష్యా చ‌ర్య‌లు అంత‌ర్జాతీయ స‌మాజానికి వ్య‌తిరేకం
  • నాటో దేశాల జోలికి వస్తే సహించేది లేదు
  • అమెరికా సేనలు రంగంలోకి దిగుతాయి
  • పుతిన్‌తో మరోసారి మాట్లాడనన్న బైడెన్‌

ఉక్రెయిన్ విష‌యంలో ర‌ష్యా తీరుపై అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ మ‌రోసారి స్పందించారు. ఉక్రెయిన్‌-ర‌ష్యా మ‌ధ్య నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై భార‌త్‌తోనూ సంప్ర‌దింపులు జ‌రుపుతున్నామ‌ని ఆయ‌న తెలిపారు. ర‌ష్యా సైబ‌ర్ దాడిని కూడా స‌మ‌ర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయ‌న ప్ర‌క‌టించారు. ర‌ష్యా చ‌ర్య‌లు అంత‌ర్జాతీయ స‌మాజానికి వ్య‌తిరేకంగా ఉన్నాయ‌ని, ఆ దేశం యుద్ధాన్ని ఎంచుకుంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

నాటోపై విద్వేషాన్ని క‌క్కుతోన్న‌ ర‌ష్యా ఆ కూట‌మిలోని సభ్య దేశాల జోలికి వస్తే సహించేది లేదని జో బైడెన్ చెప్పారు. నాటో జోలికి వ‌స్తే అమెరికా సేనలు రంగంలోకి దిగుతాయ‌ని హెచ్చ‌రించారు. రష్యాను ఇప్పుడు అదుపు చేయకపోతే ఆ దేశం మ‌రిన్ని దుందుడుకు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు.

అలాగే, ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌తో తాను మరోసారి మాట్లాడే అవ‌కాశం లేద‌ని చెప్పారు. తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీతో మాట్లాడాన‌ని తెలిపారు. ఉక్రెయిన్లో ప్ర‌జ‌లు ఎదుర్కొంటోన్న ఇబ్బందులపై స్పందిస్తామ‌ని, మానవతా దృక్ప‌థంతో సహాయం చేస్తామ‌ని అన్నారు. కాగా, మ‌రో నాలుగు  రష్యా బ్యాంకులపై ఆంక్ష‌లు విధిస్తున్నట్లు కొన్ని గంట‌ల క్రితం బైడెన్ చెప్పారు.

అలాగే, ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌కు సన్నిహితులైన ధ‌న‌వంతుల‌పై కూడా కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు ప్ర‌క‌టించారు. ఆయా బ్యాంకులు, పుతిన్ స‌న్నిహితులకు చెందిన అన్ని ఆస్తులనూ జప్తు చేస్తున్నామ‌ని చెప్పారు. అమెరికా, యూరప్‌ ఆర్థిక వ్యవస్థలతో రష్యాకు సంబంధాలన్నీ తెగిపోయినట్లేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. పుతిన్ సోవియ‌ట్ యూనియ‌న్‌ను తిరిగి స్థాపించాల‌నుకుంటున్నార‌ని ఆయ‌న చెప్పారు. పుతిన్ తో పాటు ర‌ష్యా తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొంటుంద‌ని హెచ్చ‌రించారు.

  • Loading...

More Telugu News