nv prasad: ఇది పవన్ క‌ల్యాణ్ పై దాడి కాదు... థియేటర్ల వ్యవస్థపై దాడి: ఏపీ ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్

nv prasad slams ap govt

  • థియేటర్లపై నిఘా పెంచడం స‌రికాదు
  • కష్టపడి తెలుగు ఇండస్ట్రీని తమిళనాడు నుంచి తీసుకొచ్చాం
  • అధికారులను థియేటర్లకు పంపి ఇబ్బందులు పెడుతున్నారు
  • ప‌వ‌న్‌కు న‌ష్ట‌మేమీ ఉండ‌ద‌న్న ఎన్వీ ప్ర‌సాద్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా భీమ్లా నాయక్‌ విడుదల వేళ ఏపీలోని థియేట‌ర్ల‌లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై సినీ ప్ర‌ముఖులు స్పందిస్తున్నారు. థియేటర్లపై నిఘా పెంచడం, నిబంధనలు ఉల్లంఘిస్తే క‌ఠిన‌ చర్యలు తీసుకుంటామ‌ని ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం వంటి అంశాల‌పై మండిప‌డుతున్నారు.

దీనిపై ఏపీ ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ దాడి పవన్ కల్యాణ్ పై కాద‌ని, ఇది థియేటర్ల వ్యవస్థ పై దాడి అని వ్యాఖ్యానించారు. థియేటర్ల వ్యవస్థ మీద దాడి చాలా కలిచివేస్తోందని ఆయ‌న చెప్పారు. ఎంతో కష్టపడి తెలుగు ఇండస్ట్రీని తమిళనాడు నుంచి ఇక్కడకు తీసుకువచ్చామని ఆయ‌న గుర్తు చేసుకున్నారు.

ఎగ్జిబిటర్ల ఇబ్బందుల‌పై ఏపీ ప్రభుత్వానికి చాలా సార్లు విన్నవించామని, మంత్రి పేర్ని నానిని కూడా కలిశామ‌ని అన్నారు. అయిన‌ప్ప‌టికీ స‌మ‌స్య‌లు తీర‌లేద‌ని, కరోనా వేళ సినీ రంగం మ‌ళ్లీ గాడిలో ప‌డుతుండ‌గా ఇలా దాడి చేయ‌డం స‌రికాద‌ని ఎన్వీ ప్రసాద్ అన్నారు.

అధికారులను థియేటర్లకు పంపి ఇబ్బందులు పెడుతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. పవన్ క‌ల్యాణ్‌పై దాడి చేయాలనుకుంటే రాజకీయంగా చేయాలని, అంతేగానీ, ఇలా ఆంక్షలు విధించడం వల్ల ఎగ్జిబిటర్ల వ్యవస్థకే నష్టం చేకూరుతుందని ఆయన అన్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి, వాళ్లని థియేటర్ల వద్ద కూర్చొపెట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. త‌మ సమస్యలు తీరిపోతాయని భావించామ‌ని, మ‌రిన్ని పెరిగాయ‌ని ఎన్వీ ప్రసాద్ చెప్పారు.  

ఉద‌యం 10 గంటల వరకూ షో వేయొద్దని నోటీసులు ఇచ్చారని, దానికి అనుగుణంగా తాము ఉన్నామ‌ని ఆయ‌న వివ‌రించారు. 10 గంటల లోపు సినిమా వేసే అధికారం ఎవ్వరికీ లేదని, అయితే, అధికారులు మళ్లీ థియేటర్లపై దాడి చేయడం ఎంతవరకూ న్యాయం? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ఏపీలోని సినిమా ఎగ్జిబిటర్లను ఏం చేయాలనుకుంటున్నారో బ‌హిరంగంగా ప్ర‌భుత్వం చెప్పాల‌ని ఆయ‌న నిల‌దీశారు. థియేటర్ల యజ‌మానులు ఏం చేశారని ప్ర‌భుత్వం ఇలా చేస్తోంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ దాడుల వల్ల పవన్ కల్యాణ్‌ కు ఎలాంటి నష్టం ఉండదని, ఈ విష‌యాన్ని పేర్ని నాని అర్థం చేసుకోవాల‌ని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News