Cricket: రోహిత్ చెప్పిన ఆ ఒక్క మాట తనను మార్చేసిందన్న ఇషాన్!
- టీ20ల్లో వికెట్ కీపర్ బ్యాటర్ గా అత్యధిక వ్యక్తిగత పరుగులు
- పంత్, ధోనీని దాటేసిన ఇషాన్ కిషన్
- స్ట్రయిక్ రొటేట్ చేయాలంటూ రోహిత్ చెప్పాడన్న యువ ఓపెనర్
- నెట్స్ లో దానిపై బాగా ప్రాక్టీస్ కూడా చేశానని వెల్లడి
టీమిండియా నయా ఓపెనర్ ఇషాన్ కిషన్ కొత్త చరిత్ర సృష్టించాడు. వికెట్ కీపర్లుగా ఎంఎస్ ధోనీ, రిషభ్ పంత్ సాధించలేని రికార్డును అతడు అందుకుని చూపించాడు. వికెట్ కీపర్ బ్యాటర్ గా అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో అతడు చెలరేగి 56 బంతుల్లో 89 (10×4; 3×6) పరుగులు చేసిన సంగతి తెలిసిందే. భారత్ తరఫున వికెట్ కీపర్ బ్యాటర్ గా అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే కావడం విశేషం.
2017లో బెంగళూరు వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ 56 పరుగులు చేశాడు. రిషభ్ పంత్ 2019లో వెస్టిండీస్ తో సిరీస్ లో 65 పరుగులు చేశాడు. ఇక, ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక ఫోర్లు బాదిన వికెట్ కీపర్ బ్యాటర్ గానూ అతడు రికార్డు సృష్టించాడు. అంతకుముందు 2015లో జింబాబ్వేలో రాబిన్ ఊతప్ప 9 ఫోర్లు కొట్టాడు. ఇప్పుడు అతడిని అధిగమిస్తూ ఇషాన్ కిషన్ 10 ఫోర్లు బాదాడు.
కాగా, మ్యాచ్ గురించి, తన బ్యాటింగ్ మెరుగవడం గురించి ఇషాన్ కిషన్ స్పందించాడు. రోహిత్ తనకు ఎంతో మేలు చేశాడని చెప్పాడు. స్ట్రయిక్ రొటేట్ చేయాలన్న ఒక్క విషయాన్ని తనకు చెప్పాడన్నాడు. ‘‘ఎప్పుడూ హిట్టింగే కాదు.. స్ట్రయిక్ ను రొటేట్ కూడా చేస్తుండాలంటూ రోహిత్ భాయ్ చెప్పాడు. ‘కొట్టేటప్పుడు ఎలాగో బాదేస్తావు. సింగిల్స్ తో స్ట్రయిక్ కూడా రొటేట్ చేయాలి. నీ సత్తా ఏంటో నాకు తెలుసు’ అని రోహిత్ భాయ్ మంచి మాటలు చెప్పాడు.
నా ఆటకు ఎంతో మద్దతుగా ఉన్నాడు. నెట్స్ లోనూ స్ట్రయిక్ రొటేట్ విషయంలో సాయం చేశాడు. దానిపై ఎక్కువ సాధన కూడా చేశాం. దాని వల్ల బౌలర్లపై ఒత్తిడి కూడా పెంచొచ్చని సూచనలిచ్చాడు. అది నాకు బాగా కలిసొచ్చింది. అలాంటి వాళ్లు అండగా ఉంటే మా లాంటి వాళ్ల పని సులభమవుతుంది’’ అని ఇషాన్ కిషన్ అన్నాడు.