AP High Court: జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల కేసు.. ఇద్దరు న్యాయవాదులకు బెయిల్
- ప్రతి సోమవారం సంతకం చేయాలంటూ షరతు
- ఇప్పటికే పలువురు నిందితుల అరెస్ట్
- మరికొందరి కోసం సీబీఐ గాలింపు
హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రమేయం ఉందంటూ సీబీఐ అరెస్ట్ చేసిన వ్యక్తుల్లో ఇద్దరు న్యాయవాదులకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పొందిన ఇద్దరు న్యాయవాదులు విజయవాడలోని సీబీఐ క్యాంపు కార్యాలయంలో ప్రతి సోమవారం హాజరై, సంతకం చేయాలంటూ షరతు విధించింది.
జగన్ సర్కారుకు వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయంటూ గతంలో వైసీపీ అనుకూలురతో పాటు పలువురు హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా జరిగిన ఈ తతంగం నాడు పెను దుమారమే రేపింది. ఈ కేసు స్వయంగా హైకోర్టే సీబీఐకి అప్పగించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలువురు నిందితులను సీబీఐ అరెస్ట్ చేసింది. మరికొందరి కోసం గాలిస్తోంది. ఇలా సీబీఐ అరెస్ట్ చేసిన వారిలో ఇద్దరు న్యాయవాదులకు శుక్రవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.