Russia: కీవ్ పై దాడికి రష్యా స్పెషల్ గెరిల్లా ఫోర్స్... అధ్యక్ష భవనమే లక్ష్యం!
- ఉక్రెయిన్ లో కీలక ప్రాంతాల్లో రష్యా సేనలు
- కీవ్ ను చుట్టుముట్టిన ప్రత్యేక దళాలు
- బంకర్లోకి వెళ్లిపోయిన ఉక్రెయిన్ అధ్యక్షుడు
- మరికొన్ని గంటల్లో కీవ్ ను అధీనంలోకి తీసుకోనున్న రష్యా!
ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై పట్టు సాధించడమే లక్ష్యంగా రష్యా ముందుకు కదులుతోంది. కీవ్ లోని అధ్యక్ష భవనంపై గురిపెట్టిన రష్యా స్పెషల్ గెరిల్లా ఫోర్స్ ను రంగంలోకి దించింది. ఇప్పటికే రష్యా సైనిక దళాలు కీవ్ ను చుట్టుముట్టాయి. మరికొన్ని గంటల్లో ఉక్రెయిన్ అధ్యక్ష భవనం రష్యా దళాల పరం అయ్యే అవకాశాలున్నాయని ఉక్రెయిన్ సైనికాధికారులు భావిస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోద్మిర్ జెలెన్ స్కీ ఇప్పటికే అధ్యక్ష భవనాన్ని వీడి సురక్షితమైన బంకర్లో తలదాచుకోవడం తెలిసిందే.
కాగా, ఉత్తర, ఈశాన్య దిక్కు నుంచి రష్యా దళాలు భారీగా దూసుకొస్తున్నాయని ఉక్రెయిన్ సైన్యం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కీవ్ ను సమీపించే క్రమంలో చెర్నగివ్ నగరాన్ని చుట్టుముట్టిన రష్యా దళాలను తమ సైనికులు తిప్పికొట్టారని ప్రకటించింది. అయితే, రష్యా అధీనంలో ఉన్న కోనోటాప్ నగరం వైపు నుంచి రష్యా దళాలు కీవ్ దిశగా కదులుతున్నాయని తెలిపింది.
రష్యాకు తలొగ్గరాదని ఉక్రెయిన్ కృతనిశ్చయంతో ఉంది. అందుకే సాధారణ పౌరులను సైతం దేశరక్షణ దిశగా ఆయుధాలు అందుకోవాలంటూ ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో 18 నుంచి 60 ఏళ్ల వారు దేశం విడిచి వెళ్లరాదని స్పష్టం చేసింది. రష్యన్ సైన్యంతో పోరాడేందుకు ఇప్పటికే ఉక్రెయిన్ 18 వేల మందికి ఆయుధాలు ఇచ్చింది.