Russia: ఈయూ నుంచి పుతిన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్
- యుద్ధానికి దిగిన రష్యాపై సర్వత్రా నిరసన
- నేరుగా పుతిన్‌కే హెచ్చరికలు జారీ చేసిన ఈయూ
- పుతిన్ ఆస్తులను ఫ్రీజ్ చేస్తామంటూ హెచ్చరిక
ఉక్రెయిన్‌పై యుద్దానికి తెర తీసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్ పౌరులు, ఇతర దేశాల పౌరులే కాకుండా స్వయంగా రష్యన్ పౌరులు కూడా నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. ఉక్రెయిన్‌పైకి దండెత్తి వచ్చిన పుతిన్‌ను నిలువరించేందుకు పలు దేశాలు, దేశాల కూటములు రంగంలోకి దిగినట్లుగానే కనిపిస్తోంది. ఇప్పటికే నాటో కూటమి రష్యాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేయగా..అంతకుముందే చాలా దేశాలు రష్యాపై ఆంక్షలను విధించాయి. తాజాగా అమెరికా కూడా రష్యాపై సైబర్ దాడులకు దిగిన సంగతి తెలిసిందే.
తాజాగా యూరోపియన్ యూనియన్ (ఈయూ) కూడా రష్యాపై ఆంక్షలను విధించేందుకు సిద్ధమైపోయింది. రష్యా వైఖరికి కారణంగా నిలుస్తున్న ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పైనే ఆంక్షలు విధించేలా ఈయూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు శుక్రవారం పుతిన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ ఈయూ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపకపోతే పుతిన్ ఆస్తులను ఫ్రీజ్ చేస్తామంటూ సదరు ప్రకటనలో ఈయూ గట్టి వార్నింగే ఇచ్చింది.