- ఈ నెల 24న విడుదలైన 'వలిమై'
- తమిళనాట రికార్డుస్థాయి వసూళ్లు
- తెలుగులో అదే టైటిల్ తో రిలీజ్
- వసూళ్లపై 'భీమ్లా నాయక్' ఎఫెక్ట్
అజిత్ కొతంకాలంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. తన సినిమాల రికార్డులను తానే తిరగరాస్తూ వెళుతున్నాడు. తన సినిమాల్లో యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా ఉండేలా ఆయన చూసుకుంటాడు. ఈ సారి మాత్రం కాస్త యాక్షన్ పాళ్లు ఎక్కువగా ఉన్న 'వలిమై' చేశాడు. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో విడుదలైంది.
తమిళ బాక్సాఫీస్ దగ్గర తొలి రోజున ఈ సినిమా చేసిన సందడి అంతా ఇంతా కాదు. థియేటర్ల దగ్గర జాతర వాతావరణం కనిపించిందని తమిళ మీడియా చెబుతోంది. తొలి రోజున ఈ సినిమా తమిళనాడు బాక్సాఫీస్ నుంచి 36.17 కోట్లను వసూలు చేసినట్టుగా చెబుతున్నారు. ఫస్టు డే వసూళ్ల విషయంలో అక్కడ రజనీ '2.0' .. 'అన్నాత్తే'కి మించి ఈ సినిమా వసూళ్లను రాబట్టిందని అంటున్నారు.
ఇక తెలుగు విషయానికి వస్తే ఇక్కడ అంతగా ఈ సినిమాపై ప్రేక్షకులు దృష్టి పెట్టినట్టుగా కనిపించడం లేదు. తెలుగులో హీరోగా మంచి క్రేజ్ ఉన్న కార్తికేయ ఈ సినిమాలో విలన్ గా నటించినప్పటికీ, థియేటర్స్ దగ్గర ఆశించిన స్థాయిలో సందడి కనిపించడం లేదు. 'భీమ్లా నాయక్' ఎఫెక్ట్ తమ సినిమాపై ఉంటుందని కార్తికేయ చెప్పినట్టుగానే జరిగింది.
తమిళ టైటిల్ తోనే తెలుగులో రిలీజ్ చేయడం .. పెద్దగా పబ్లిసిటీ లేకపోవడం కూడా ఈ సినిమాకి మైనస్ గా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతే కాకుండా ఈ సినిమాలో కథానాయికగా కనిపించిన హుమా ఖురేషి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఇక మిగతా భాషల్లో ఈ సినిమా జోరు ఎలా ఉందనేది చూడాలి.