Ukraine: ఉక్రెయిన్ కు ఆయుధాలను పంపిస్తున్న మిత్రదేశాలు
- మూడ్రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా దాడులు
- కీవ్ వీధుల్లోకి చేరిన పోరాటం
- వెనుకంజ వేసేది లేదన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు
- మిత్రదేశాలు స్పందిస్తున్నాయని వెల్లడి
తమ దేశంలో దురాక్రమణకు తెగబడిన రష్యాపై పోరుబాట వీడేది లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్ స్కీ తెగేసి చెబుతున్నారు. ఈ ఉదయం ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ తో మాట్లాడానని వెల్లడించారు. దౌత్యపరమైన సంభాషణతో కొత్త రోజు ప్రారంభమైందని తెలిపారు.
కాగా, తమ పట్ల మిత్రదేశాల నుంచి స్పందన ప్రారంభమైందని, మిత్రదేశాలు పంపిస్తున్న ఆయుధాలు, కీలక సామగ్రి మార్గమధ్యంలో ఉన్నాయని జెలెన్ స్కీ వివరించారు. యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న దేశాలతో కూడిన సంకీర్ణం రంగంలోకి దిగిందని తెలిపారు.
కాగా, నిన్న కీవ్ శివార్ల వద్దకు చేరుకున్న రష్యా దళాలు నేడు ఆ నగర వీధుల్లోకి ప్రవేశించాయి. ఉక్రెయిన్ దళాలకు, రష్యన్ సేనలకు భీకరమైన పోరు జరుగుతున్నట్టు తెలుస్తోంది. రష్యా దాడులకు ఇవాళ మూడో రోజు కాగా, ఇప్పటివరకు జరిగిన ప్రాణనష్టంపై కచ్చితమైన సమాచారం లభించడంలేదు. 1000 మందికి పైగా రష్యన్ సైనికులను హతమార్చామని ఉక్రెయిన్ చెబుతున్నప్పటికీ, రష్యా ఆ ప్రకటనను ఖండించింది.