lic: కేంద్రం కీలక నిర్ణయం.. ఎల్ఐసీలోకి ఎఫ్‌డీఐలకు ఓకే
- ఇప్పటికే కొంతమేర పెట్టుబడుల ఉపసంహరణకు రంగం సిద్ధం
- తాజాగా ఎల్ఐసీలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకూ అవకాశం
- ఎల్ఐసీలో 20 శాతం మేర ఎఫ్‌డీఐలకు గ్రీన్ సిగ్నల్
భారత ప్రభుత్వరంగ బీమా సంస్థగా కొనసాగుతున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) ఇకపై ప్రభుత్వ రంగ బీమా సంస్థగా కొనసాగే అవకాశాలు లేవేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎల్ఐసీ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటిదాకా అందులోని ప్రతి పైసా ప్రభుత్వానికి చెందినదిగానే భావించేవారు. అయితే ఇప్పుడు ఎల్ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణకు తెర తీసిన కేంద్ర ప్రభుత్వం కొంత మేర షేర్లను అమ్మేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇది చాలదన్నట్లుగా ఇప్పుడు ఎల్ఐసీకి సంబంధించి మరో కీలక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది.
ఎల్ఐసీలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు తెరుస్తూ నరేంద్ర మోదీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. 20 శాతం మేర వాటాలను ఎఫ్‌డీఐలకు కేటాయించవచ్చంటూ తాజాగా కేంద్రం ఆమోదం తెలిపినట్టు సమాచారం. భారత బీమా రంగం నిబంధనల మేరకు ఏదేనీ సంస్థలో 74 శాతం మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఉంది. అయితే ఈ నిబంధన ఎల్ఐసీకి వర్తించదు. తాజాగా ఎల్ఐసీలో కొంత మేర పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్న నేపథ్యంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇస్తే తప్పేముందన్నభావనతోనే కేంద్రం ఎల్ఐసీలోకి ఎఫ్‌డీఐలకు అనుమతి ఇచ్చిందేమోనన్న వాదనలు వినిపిస్తున్నాయి.