KTR: ధరణి సమస్యలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి: రేవంత్ రెడ్డి
- ధరణి సమస్యలపై కార్యాలయాల చుట్టూ రైతులు
- సమస్యలు పరిష్కారం కాక నిరసనలు
- ప్రభుత్వానికి ఓటు అడిగే హక్కు లేదంటూ పోస్టర్లు
- రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద పరిస్థితిని వీడియో తీసి పెట్టిన రేవంత్ రెడ్డి
తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్లు,ఇతరత్రా భూముల వివరాలన్నింటినీ ఒకే చోటకు తీసుకొస్తున్నామంటూ కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ రైతులు, భూ యజమానులకు లెక్కలేనన్ని సమస్యలను సృష్టిస్తోందంటూ ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణల్లో నిజమెంత ఉందో తెలియదు గానీ.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఓ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది.
ధరణి పోర్టల్ కారణంగా ఏర్పడ్డ కొత్త సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న ప్రజలు చివరకు ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద పోస్టర్లు అంటించారట. రైతులకు ఇబ్బంది పెట్టే ధరణి సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వానికి ఓటు అడిగే హక్కు లేదు అంటూ సదరు పోస్టర్లలో రైతులు రాశారు. ఈ పోస్టర్లను, రంగారెడ్డి కలెక్టరేట్ నేమ్ బోర్డు కనిపించేలా వీడియో తీసిన రేవంత్ రెడ్డి దానిని ట్విట్టర్‌లో పోస్ట్‌చేశారు. ఐటీలో బిల్ గేట్స్‌కే గురువునని చెప్పుకునే కేటీఆర్ దీనికి సమాధానం చెప్పాలంటూ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.