Ukraine: ముంబై చేరిన విమానం.. విద్యార్థులకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వాగతం
- ఎంబసీ సూచనలు పాటిస్తూ రొమేనియా సరిహద్దు చేరుకున్న భారతీయులు
- వారిని ఎయిరిండియా విమానం ఎక్కించిన అధికారులు
- సురక్షితంగా ముంబై చేరుకున్న విమానం
రష్యా మొదలుపెట్టిన యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుబడిపోయిన భారత విద్యార్థులను సురక్షితంగా దేశానికి చేర్చే ప్రక్రియలో భాగంగా తొలి ఘట్టం పూర్తి అయ్యింది. 219 మందితో ఉక్రెయిన్ సరిహద్దు దేశం రొమేనియా నుంచి శనివారం మధ్యాహ్నం బయలుదేరిన ఎయిరిండియా విమానం కాసేపటి క్రితం ముంబైలో ల్యాండైంది. ఈ విమానంలో వచ్చిన విద్యార్థులకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వాగతం పలికారు.
భారత విదేశాంగ శాఖ సూచనలను అనుసరిస్తూ ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్ధుల్లో 219 మంది రొమేనియా సరిహద్దులకు చేరుకున్నారు. వీరిని అప్పటికే అక్కడ సిద్ధంగా ఉంచిన ఎయిరిండియా విమానంలో ఎక్కించారు. ఆ వెంటనే టేకాఫ్ తీసుకున్న విమానం.. కాసేపటి క్రితం ముంబై ఎయిర్ పోర్టులో ల్యాండైంది. యుద్ధం నేపథ్యంలో భీతావహ పరిస్థితులను కళ్లారా చూసిన భారత విద్యార్థులు ముంబైకి చేరుకోగానే ఊపిరిపీల్చుకున్నారు.