KCR: కేసీఆర్ కబంధ హస్తాల్లో తెలంగాణ: రేవంత్ రెడ్డి
- కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి
- మంత్రి సబితపైనా విమర్శల దాడి
- ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును చేవెళ్లకు రాకుండా అడ్డుకున్నారని ధ్వజం
తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిల్లాడుతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనా తీరుపై శనివారం నాడు మీడియాతో మాట్లాడిన సందర్భంగా రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. బంగారు తెలంగాణ చేస్తామని చెప్పిన కేసీఆర్ రాష్ట్రాన్ని తన కబంధ హస్తాల్లో ఇరికించుకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను కొండా రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, మాణిక్ రావ్, దేవేందర్ గౌడ్ లు అభివృద్ధి చేస్తే.. పరిగి ఎమ్మెల్యే దేవుడి మాన్యాలను మింగాడని ఆరోపించారు. చేవెళ్ల చెల్లమ్మను టీఆర్ఎస్ లో కలుపుకున్న కేసీఆర్... ఆ ప్రాంతంపై శీతకన్నేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అభివృద్ధి కోసం టిఆర్ఎస్ లో కలిశామన్న చేవెళ్ల చెల్లమ్మ ఎందుకు చేవెళ్ల అభివృద్ధి కోసం అడగడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఈ ప్రాంతానికి రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత చేవెళ్ల తెస్తే.. కిరణ్ కుమార్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి జీవో ఇచ్చారన్నారు. ప్రాణహితను చేవెళ్లకు రాకుండా అడ్డుకున్నది కేసీఆర్ కాదా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంపై యాదగిరి గుట్టలో కేసీఆర్ ప్రమాణం చేయగలరా? అని కూడా ఆయన ప్రశ్నించారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లను ఏ దేవుడు పాలిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.