us: ఉక్రెయిన్-రష్యా సంక్షోభం.. భారత్ సాయాన్ని కోరిన అమెరికా

US urges India to use influence with Russia

  • రష్యాపై ఒత్తిడి తీసుకురావాలి
  • అంతర్జాతీయ ఒప్పందాలకు కట్టుబడేలా చూడాలి
  • అది అందరి ప్రయోజనాలకు మంచిది
  • అమెరికా విదేశాంగ ప్రతినిధి నెడ్ ప్రైజ్

ఉక్రెయిన్-రష్యా మధ్య నెలకొన్న సంక్షోభ పరిష్కారానికి భారత్ సాయాన్ని అమెరికా కోరింది. అంతర్జాతీయ ఒడంబడికలకు కట్టుబడి రష్యా నడుచుకునేలా ఆ దేశంపై ఒత్తిడి తీసుకురావాలని భారత్ కు సూచించింది.  ఉక్రెయిన్ అంశంలో పాశ్చాత్య సమాజం అభిప్రాయాలకు భారత్ మద్దతుగా నిలవకపోవడం పట్ల అమెరికా అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సంక్షోభం భారత్, అమెరికా సంబంధాలపై ప్రభావం చూపిస్తుందా? అంటూ మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది.

దీనికి అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైజ్ స్పందించారు. ‘‘భారత్-రష్యా మధ్య ఉన్న బంధం.. భారత్-అమెరికాతో ఉన్న బంధం కంటే భిన్నమైనదని మా అభిప్రాయం. అయితే అంతర్జాతీయ ఒప్పందాలను రష్యా అనుసరించేలా ఆ దేశంపై ఒత్తిడి తీసుకురాగలిగిన దేశాలు తమవంతు కృషి చేయాలని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల అభిప్రాయం’’ అని నెడ్ ప్రైజ్ చెప్పారు.

ఈ తరహా అంతర్జాతీయ ఒప్పందాలే భారత్ కు, అమెరికాకు, ఐరోపా భాగస్వామ్య దేశాలకు, రష్యాకు సైతం గత 70 ఏళ్ల కాలంలో ప్రయోజనం చేకూర్చినట్టు ప్రైజ్ తెలిపారు. అంగీకరించిన నిబంధనలు, ఒప్పందాలకు ప్రపంచ దేశాలు కట్టుబడి ఉండడం, వాటి పరిధిలో నడుచుకోవడమే అంతర్జాతీయ నడవడిక. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో భారత ప్రధాని మోదీ ఇప్పటికే టెలిఫోన్ లో సంభాషించడం తెలిసిందే. రష్యాతో దశాబ్దాలుగా భారత్ కు బలమైన బంధం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ సహకారాన్ని అమెరికా కోరడం వ్యూహాత్మకంగా భావించాలి.

  • Loading...

More Telugu News