Roja: చంద్ర‌బాబు చెప్పింది ప‌వ‌న్ క‌ల్యాణ్‌ చేశారు.. అందుకే భీమ్లా నాయ‌క్ విష‌యంలో ఇలా జ‌రుగుతోంది: రోజా

MLA Roja strong comments on Pawan Kalyan

  • ప‌వ‌న్ క‌ల్యాణ్ ను తొక్కేయ‌డానికే జ‌గ‌న్ ప్ర‌య‌త్నించ‌ట్లేదు
  • అల్లు అర్జున్, బాల‌కృష్ణ సినిమాల‌కూ టికెట్ ధ‌ర ఇంతే..
  • ధ‌ర పెంచాలంటే జాయింట్ క‌లెక్ట‌ర్ల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి
  • ఇవ‌న్నీ చేయ‌కుండా జ‌న‌సేన ప‌బ్లిసిటీ కోసం ప‌వ‌న్ సినిమా విడుద‌ల చేశారు

పవన్ కల్యాణ్ న‌టించిన 'భీమ్లా నాయ‌క్' సినిమా విడుద‌లైన నేప‌థ్యంలో ఏపీ ప్రభుత్వం థియేట‌ర్ల‌లో నిబంధ‌న‌లు క‌ఠిన‌త‌రం చేయ‌డంతో వివాదం రాజుకున్న విష‌యం తెలిసిందే. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. ఈ రోజు తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ను తొక్కేయ‌డానికే జ‌గ‌న్ ఇదంతా చేస్తున్నార‌ని కొంద‌రు అంటున్నార‌ని చెప్పారు. 

ఇటువంటి ప్ర‌చారం జ‌రుగుతుండ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ఆమె అన్నారు. నిజానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌కి జగన్ మేలు చేస్తున్నారని రోజా చెప్పుకొచ్చారు. ఎందుకంటే తెలంగాణలో సినిమా టికెట్‌ ధర రూ.350 ఉంద‌ని, ఏపీలో మాత్రం కేవ‌లం రూ.150 ఉందని చెప్పారు. చాలా మంది సినిమా చూసే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. 

టికెట్ల ధ‌ర‌లు త‌గ్గిస్తే ప‌వ‌న్ క‌ల్యాణ్ ను తొక్కేసిన‌ట్లు ఎలా అవుతుంద‌ని ఆమె ప్ర‌శ్నించారు. సినిమా న‌ష్ట‌పోతే ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు వచ్చే నష్టమేమి లేద‌ని, ఎందుకంటే ఆయ‌న నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్ కాద‌ని ఆమె అన్నారు. అల్లు అర్జున్ పుష్ప సినిమా, బాల‌కృష్ణ అఖండ సినిమాల‌కు ఎంత టికెట్ ధ‌ర ఉందో భీమ్లా నాయ‌క్ సినిమాకు కూడా అంతే రేటు ఉంద‌ని ఆమె అన్నారు. 

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు అన్యాయం జ‌ర‌గ‌ట్లేద‌ని ఆయ‌న అభిమానులు తెలుసుకోవాల‌ని ఆమె చెప్పారు. మా నియోజ‌క వ‌ర్గంలో కూడా ప‌వన్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ మా ఫ్లెక్సీలు చించేసి గొడ‌వ చేశారు. దీంతో నేను వాళ్ల‌కి ఓ విష‌యం చెప్పాల‌నుకుంటున్నాను. చిరంజీవి, మ‌హేశ్ బాబు, ప్ర‌భాస్ లాంటి వారు సీఎం జ‌గ‌న్ వ‌ద్ద‌కు వ‌చ్చి మాట్లాడార‌ని, జ‌గ‌న్ సానుకూలంగా స్పందించార‌ని చెప్పారు. 

దీనిపై క‌మిటీ కూడా వేశార‌ని, మంత్రి మేక‌పాటి గౌతమ్‌రెడ్డి మ‌ర‌ణంతో తుది స‌మావేశం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో థియేట‌ర్ల విష‌యంలో నిర్ణ‌యం వాయిదా ప‌డింద‌ని ఆమె చెప్పారు. ఇక్క‌డ ఎవ‌రికో అన్యాయం జ‌రుగుతోంద‌ని అన‌డం స‌రికాదని అన్నారు. నిజానికి రేట్లు పెంచాక మార్చిలో ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాను విడుద‌ల చేసుకునే అవ‌కాశం ఉంద‌ని ఆమె అన్నారు. అలాగే, హైకోర్టు చెప్పిన‌ట్లుగా, ఏ జిల్లాకు ఆ జిల్లాలో జాయింట్ క‌లెక్ట‌ర్‌కు సినిమా టికెట్ల ధ‌ర‌లు పెంచాల‌ని ద‌ర‌ఖాస్తులు చేసుకునే అవకాశం ఉంద‌ని అన్నారు. 

అలా చేయ‌కుండా చంద్ర‌బాబు నాయుడు చెప్పిన‌ట్లు ప‌వ‌న్ క‌ల్యాణ్ చేశార‌ని, త‌న సినిమాతో ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న జ‌న‌సేన పార్టీని నిల‌బెట్టుకోవాల‌ని అనుకున్నార‌ని రోజా తెలిపారు. ఈ విష‌యాన్ని అభిమానులు, ప్ర‌జ‌లు గుర్తించాల‌ని ఆమె చెప్పారు. జ‌గ‌న్ అన్ని స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించి మంచి నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని, ప్ర‌తి దాన్ని రాజ‌కీయాలు చేయాల‌ని అనుకోవ‌డం మానేస్తే బాగుంటుంద‌ని ఆమె చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News