Indian students: భారత విద్యార్థులకు ఆకర్షణీయంగా ‘ఉక్రెయిన్ వైద్య విద్య’.. ఎందుకని?
- కోర్సు వ్యయం చాలా తక్కువ
- రూ.30 లక్షలు ఉంటే చాలు
- ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసుకోవచ్చు
- రుణ సదుపాయాన్నీ కల్పిస్తున్న కన్సల్టెంట్స్
మన దేశం నుంచి వేలాది మంది వైద్య విద్య కోసం ఉక్రెయిన్ కు వెళుతుంటారు. ముఖ్యంగా దక్షిణాది విద్యార్థులు ఉక్రెయిన్ కు ప్రాధాన్యం ఇస్తుంటారు. దీంతో ఉక్రెయిన్ లో అంత ప్రత్యేకత, సానుకూలతలు ఏమున్నాయి? అన్న సందేహాలు రావడం సహజం.
మన దేశంలో వైద్య విద్య ఎంతో ఖరీదైన వ్యవహారం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్యులు, మధ్యతరగతి నుంచి ఎవరైనా వైద్య విద్య చేయాలంటే.. ఆర్థికంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సిందే. ప్రభుత్వ కోటాలో సీటు సంపాదిస్తే సరి. లేదంటే ప్రైవేటు కాలేజీలు డిమాండ్ చేసే ఫీజులను కట్టడం అందరి వల్లా అయ్యే పని కాదు.
ఉదాహరణకు కర్ణాటక రాష్ట్రంలో 9,000 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. కానీ, వీటిలో ప్రభుత్వ కోటా 40 శాతం కంటే తక్కువే. తెలంగాణలో ఎంబీబీస్ సీట్లు 5,000కు పైనే ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ కోటా మూడింట ఒక వంతుగానే ఉంటోంది. ప్రైవేటు కాలేజీలు ఎంబీబీఎస్ కు ఫీజులను భారీగా వసూలు చేస్తున్నాయి. ఎంబీబీఎస్ పూర్తి కోర్సుకు కనీసం కోటి, ఆపైనే సమర్పించుకోవాల్సిన పరిస్థితి ఉంది.
కానీ, ఉక్రెయిన్ కు వెళితే రూ.25-30 లక్షలకే ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసుకుని రావచ్చు. కన్సల్టింగ్ ఏజెన్సీలు అడ్మిషన్ ఇప్పించడంతోపాటు, రుణ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నాయి. ఉక్రెయిన్ లో విద్యా నాణ్యత చక్కగా, అందుబాటు ధరల్లో ఉంటుంది. డొనేషన్ ఉండదు. భద్రత ఉంటుంది. దీంతో డాక్టర్ కావాలన్న సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఉక్రెయిన్ తోపాటు జార్జియా, కిర్గిస్థాన్ ఆశాకిరణాలుగా మారాయి.