Google: రష్యా మీడియా చానళ్లు, యూట్యూబ్ చానళ్ల ఆదాయంపై కత్తెర వేసిన గూగుల్
- ఉక్రెయిన్ పై దాడి నేపథ్యంలో రష్యాపై ఆగ్రహావేశాలు
- ఇప్పటికే ఆంక్షలు విధించిన ఈయూ
- రష్యా విమానాలకు ప్రవేశం నిషేధించిన పలు దేశాలు
- రష్యా మీడియా సంస్థలకు యాడ్స్ తొలగించిన గూగుల్
ఉక్రెయిన్ పై దండయాత్ర చేస్తున్న రష్యాను ఏకాకిని చేసేందుకు అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈయూ దేశాలు రష్యా బ్యాంకులు, సంపన్నులపై ఆంక్షలు విధించడం, స్విఫ్ట్ నుంచి రష్యాను తప్పించడం తెలిసిందే. బెల్జియం వంటి యూరప్ దేశాలు రష్యా విమానాలకు తమ గగనతలంలో ప్రవేశాన్ని నిషేధించాయి. కాగా, టెక్ దిగ్గజం గూగుల్ కూడా రష్యాపై చర్యలకు దిగింది.
రష్యా ప్రభుత్వ టీవీ చానల్ ఆర్టీ, ఇతర చానళ్ల వెబ్ సైట్లు, యాప్ లు, యూట్యూబ్ చానళ్లలో గూగుల్ యాడ్స్ ను తొలగించింది. యూట్యూబ్ దీనిపై స్పందిస్తూ, తమ ద్వారా రష్యా చానళ్లు ఆదాయం పొందడాన్ని (మోనిటైజింగ్) నిలిపివేశామని వెల్లడించింది. ప్రస్తుతం నెలకొన్న కొన్ని 'అసాధారణ పరిస్థితులు' అందుకు దారితీశాయని పేర్కొంది.
గూగుల్ ప్రతినిధి మైకేల్ అసిమన్ స్పందిస్తూ, ఇకపై రష్యన్ మీడియా సంస్థలు గూగుల్ యాడ్స్ ను పొందలేవని, గూగుల్ టూల్స్, గూగుల్ సర్వీసెస్ ను పొందలేవని స్పష్టం చేశారు. సెర్చ్, జీమెయిల్ సేవలు అందుబాటులో ఉండవని వివరించారు. ప్రస్తుత పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని, అవసరమైన మరిన్ని చర్యలు తీసుకుంటామని అసిమన్ చెప్పారు.