Vladimir Putin: రష్యా అణ్వస్త్ర నిరోధక విభాగాలు సర్వసన్నద్ధంగా ఉండాలని ఆదేశించిన పుతిన్
- నాటో దేశాల తీరుపై అనుమానంతో ఉన్న పుతిన్
- తీవ్ర స్వరం వినిపిస్తున్న నాటో దేశాలు
- బెలారస్ లో రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు
- నిర్ధారించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు
ఉక్రెయిన్ అంశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నాటో దేశాల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న పుతిన్ రష్యా అణ్వస్త్ర నిరోధక విభాగాలు సర్వసన్నద్ధంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
నాటో దేశాలు దూకుడు ప్రదర్శిస్తుండడం, స్విఫ్ట్ నుంచి రష్యాను తొలగించడం, కఠినమవుతున్న ఆర్థికాంక్షలు, తమ విమానాలకు గగనతల నిషేధం విధించడం పుతిన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలుగా తెలుస్తున్నాయి. గత కొన్నిరోజులుగా నాటో దేశాల ప్రకటనలు కఠినంగా ఉంటున్నాయి. ఉక్రెయిన్ పై సైనికచర్య నేపథ్యంలో, నాటో దేశాలు ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉందని పుతిన్ అనుమానిస్తున్నారు.
కాగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ రష్యాతో చర్చలను నిర్ధారించారు. బెలారస్ సరిహద్దుల వద్ద చర్చలు జరుగుతాయని తెలిపారు. చర్చల విషయమై జెలెన్ స్కీ బెలారస్ నేత అలెగ్జాండర్ లూకాషెంకోతో మాట్లాడారు. చెర్నోబిల్ ప్రాంతంలో చర్చలు జరపాలని ఉక్రెయిన్, రష్యా అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తోంది.