Ukraine: యుద్ధం ముగిసేంత వరకు ఉక్రెయిన్ నుంచి రాను: హర్యానా విద్యార్థిని
- యుద్ధం ప్రారంభమైన తర్వాత ఓ ఇంట్లో అద్దెకు దిగిన విద్యార్థిని
- తుపాకీ చేతపట్టి యుద్ధ రంగంలోకి దిగిన ఇంటి యజమాని
- ఆయన భార్య, పిల్లలను తాను చూసుకుంటున్నానన్న విద్యార్థిని
రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఉక్రెయిన్ పై అత్యాధునిక ఆయుధాలతో రష్యా విరుచుకుపడుతోంది. రష్యా బలగాలపై ఉక్రెయిన్ సైన్యం కూడా అదే స్థాయిలో దాడి చేస్తోంది. యుద్ధం వల్ల ఉక్రెయిన్ నగరాలు ధ్వంసమవుతున్నాయి. రష్యాను ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ ప్రజలు కూడా ఆయుధాలను చేతపట్టారు.
మరోవైపు ఉక్రెయిన్ లో భారీ సంఖ్యలో మన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరంతా అక్కడ తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే వారిని అక్కడి నుంచి తీసుకొచ్చే కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం చేపట్టింది.
ఎప్పుడెప్పుడు ఉక్రెయిన్ నుంచి బయటపడతామా అని అందరూ ఉత్కంఠగా ఉండగా... మరోవైపు హర్యానాకు చెందిన ఓ విద్యార్థిని మాత్రం తాను ఉక్రెయిలోనే ఉంటానని స్పష్టం చేసింది. యుద్ధం ముగిసేంత వరకు తాను ఇక్కడే ఉంటానని ఆమె తెలిపింది.
ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ఆమె ఎంబీబీఎస్ చదువుతోంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత తాను ఉంటున్న హాస్టల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, ఆమె హాస్టల్ ను వీడి, నగరంలోనే మరోచోట ఓ భూస్వామ్య కుటుంబం ఇంట్లో అద్దెకు దిగింది. ఆ ఇంట్లో భార్యాభర్తలు, ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు.
ఇక ఆ ఇంటి యజమాని స్వచ్ఛందంగా ఆయుధం చేతబట్టి ఉక్రెయిన్ సైన్యంతో కలిసి యుద్ధంలో పాల్గొంటున్నాడు. దీంతో ఇంట్లో ఉన్న తల్లి, ముగ్గురు పిల్లలను తాను చూసుకుంటున్నానని ఆమె తెలిపింది. అందుకే యుద్ధం ముగిసేంత వరకు తాను ఇక్కడే ఉంటానని చెప్పింది.