Russia: ఐదో రోజూ కొనసాగుతోన్న యుద్ధం.. గత రాత్రల్లా చెర్నిహివ్‌పై రష్యా బాంబులు
- చెర్నిహివ్‌లోని రెసిడెన్షియల్ భవనంపై రష్యా క్షిపణి దాడి
- ఆ భవనంలోని రెండు అంతస్తుల్లో మంటలు
- కీవ్ తో పాటు ఖార్కివ్‌లోనూ రష్యా దాడులు
వరుసగా ఐదో రోజు కూడా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం దాడులు చేస్తోంది. ఉక్రెయిన్‌లోని చెర్నిహివ్ పై గత రాత్రి మొత్తం రష్యా బాంబుల వర్షం కురిపించింది. చెర్నిహివ్‌లోని రెసిడెన్షియల్ భవనంపై రష్యా క్షిపణి దాడి చేసింది. దీంతో ఆ భవనంలోని రెండు అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ తో పాటు ఖార్కివ్‌లోనూ రష్యా దాడులు కొనసాగిస్తోంది.
రష్యాపై పలు దేశాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి. రష్యాపై ఒత్తిడి పెంచుతూ అనేక దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఉక్రెయిన్‌కు ఈయూ కూడా ఆయుధాలు పంపుతోంది. ఉక్రెయిన్‌కు ఈయూ నుంచి యుద్ధ విమానాలు కూడా వెళ్తున్నాయి. అయినప్పటికీ రష్యా అధ్యక్షుడు పుతిన్ వెనక్కి తగ్గట్లేదు.
మరోపక్క, ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నేడు నాటో నేతలతో సమావేశం కానున్నారు. ఉక్రెయిన్ పై రష్యా దాడులను జీ7 దేశాలు ఖండించాయి. ఉక్రెయిన్ కు అండగా ఉంటామని తెలిపాయి. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి కులేబాతో జీ7 దేశాల విదేశాంగ మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఉక్రెయిన్ కు రక్షణ, ఆర్థిక పరంగా సాయం చేస్తామని ప్రకటించారు.
కీవ్‌లోని రేడియో యాక్టివ్ వేస్ట్ ఫెసిలిటీ సెంటర్ పై రష్యా క్షిపణులతో దాడి చేసింది. అయితే, అణుశక్తి కేంద్రానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని అక్కడి అధికారులు ప్రకటించారు. రష్యా బలగాలను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ సైన్యం పోరాడుతోంది. పౌరులు కూడా ఆయుధాలతో రష్యా సైన్యాన్ని ఎదుర్కొంటున్నారు. ఉక్రెయిన్ నుంచి విదేశీ పౌరుల తరలింపు పక్రియ కొనసాగుతోంది. మొదట ఉక్రెయిన్ నుంచి పొరుగు దేశాలకు రోడ్డు మార్గాల ద్వారా, ఆ తర్వాత ఆయా దేశాల నుంచి స్వదేశానికి విమానాల ద్వారా వారిని తరలిస్తున్నారు.