Mayank Agarwal: మయాంక్ అగర్వాల్ కే పట్టం.. కెప్టెన్ గా ప్రకటించిన పంజాబ్ కింగ్స్
- భవిష్యత్తు కోసం బలమైన పునాది వేస్తున్నాం
- మయాంక్ లో నాయకత్వ లక్షణాలున్నాయన్న అనిల్ కుంబ్లే
- గౌరవంగా భావిస్తున్నానన్న మయాంక్
అందరూ అనుకున్నట్టుగానే పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ పగ్గాలు మయాంక్ అగర్వాల్ ను వరించాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజన్ కు కెప్టెన్ గా మయాంక్ అగర్వాల్ వ్యవహరిస్తాడని యాజమాన్యం ప్రకటించింది. ఈ ఏడాది నుంచి రెండు కొత్త జట్లు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీల రాకతో జట్ల సంఖ్య 10కి పెరిగింది. దీంతో ఒక్కో జట్టు గరిష్ఠంగా నలుగురిని అట్టిపెట్టుకుని మిగిలిన వారిని విడుదల చేయాలని ఐపీఎల్ కోరింది.
కానీ, పంజాబ్ కింగ్స్ జట్టు ఇద్దరినే రిటైన్ చేసుకుంది. వారిలో మయాంక్ అగర్వాల్ ఒకడు. రూ.12 కోట్ల ప్యాకేజీని ఆఫర్ చేసింది. మెగా వేలంలో శిఖర్ ధావన్ ను కూడా పంజాబ్ కింగ్స్ కొగుగోలు చేసింది. దీంతో శిఖర్ ధావన్ కెప్టెన్ కావచ్చన్న ఊహాగానాలు వచ్చాయి. మయాంక్ అగర్వాల్ కెప్టెన్ కావచ్చన్న సంకేతాలను యాజమాన్యం లోగడ ఇచ్చింది. ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది.
‘పంజాబ్ కొత్త కెప్టెన్ కు మీరు అభినందనలు తెలియజేయండి’ అంటూ పంజాబ్ కింగ్స్ ట్విట్టర్లో కోరింది. పంజాబ్ కింగ్స్ జట్టును ఐపీఎల్ 2022 సీజన్ లో నడిపించడాన్ని గౌరవంగా, సంతోషంగా భావిస్తున్నట్టు మయాంక్ అగర్వాల్ పేర్కొన్నాడు. ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ స్క్వాడ్ లో ఉన్న నైపుణ్యాల వల్ల కెప్టెన్ గా తన ఉద్యోగం సులభమేనని మయాంక్ తెలిపాడు.
పంజాబ్ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే మాట్లాడుతూ.. ‘‘2018 నుంచి జట్టుతో మయాంక్ కొనసాగుతున్నాడు. గత రెండు సంవత్సరాల నుంచి నాయకత్వ బృందంలోనూ ఉన్నాడు. మయాంక్ సారథ్యంలో భవిష్యత్తు కోసం బలమైన పునాది వేయాలని అనుకుంటున్నాం. లీడర్ కు కావాల్సిన అన్ని లక్షణాలు అతడిలో ఉన్నాయి. అతడితో కలసి పనిచేయాలనుకుంటున్నాను’’ అని తెలిపాడు.