Ukraine: ఉక్రెయిన్ నుంచి తిరిగి రావడంలో ఇదే అసలైన సమస్య: భారత్ కు తిరిగొచ్చిన విద్యార్థి
- ఉక్రెయిన్ బోర్డర్ దాటడమే అసలైన సమస్య
- ఇండియన్ ఎంబసీ అన్ని విధాలుగా సహకరించింది
- చాలా మంది భారతీయులు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయారన్న విద్యార్ధి
ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులతో వచ్చిన ఐదో విమానం ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఈ ఉదయం ల్యాండ్ అయింది. ఈ విమానంలో 249 మంది స్వదేశానికి చేరుకున్నారు. రొమేనియాలోని బుచారెస్ట్ నుంచి విమానం భారత్ కు వచ్చింది. గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠను అనుభవించిన వీరు.. స్వదేశానికి చేసుకున్న వెంటనే ఊపిరి పీల్చుకున్నారు. తమను సురక్షితంగా ఇక్కడకు చేరుకునేలా చేసిన ఇండియన్ ఎంబసీకి వారు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఓ విద్యార్థి మాట్లాడుతూ, భారత ప్రభుత్వం తమకు ఎంతో సాయం చేసిందని కృతజ్ఞతలు తెలిపాడు. ఉక్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీ తమకు అన్ని విధాలుగా సహకరించిందని చెప్పాడు. అయితే ఇండియాకు తిరిగి వచ్చే క్రమంలో ఉక్రెయిన్ బోర్డర్ దాటి, సరిహద్దు దేశాల్లోకి అడుగు పెట్టడమే అతి పెద్ద సమస్య అని తెలిపాడు. అందరు విద్యార్థులు సురక్షితంగా ఇండియాకు తిరిగి వస్తారనే నమ్మకం తనకుందని చెప్పాడు. ఇంకా చాలా మంది భారతీయులు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయారని తెలిపాడు.
మరోవైపు తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా బోర్దర్ చెక్ పాయింట్ల వద్దకు వెళ్లొద్దని ఇండియన్ ఎంబసీ ఇంతకు ముందే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఎంబసీ అధికారులకు సమాచారం ఇవ్వకుండా బోర్డర్ చెక్ పాయింట్లకు వెళ్తే చాలా సమస్యలు ఎదుర్కొంటారని హెచ్చరించింది.
ఇంకోవైపు ఉక్రెయిన్ నుంచి మన వాళ్లను వెనక్కి తీసుకువచ్చే కార్యక్రమానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగా అని నామకరణం చేసింది. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన హంగరీ, పోలాండ్, రొమేనియా, స్లోవాక్ రిపబ్లిక్ దేశాల హెల్ప్ లైన్ నంబర్లను భారత విదేశాంగశాఖ ఏర్పాటు చేసింది. ఇప్పటికీ దాదాపు 16 వేల మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయినట్టు సమాచారం. వీరిలో చాలా మంది అండర్ గ్రౌండ్ బంకర్లు, బాంబ్ షెల్టర్లలో తలదాచుకున్నారు.