Nara Lokesh: మీడియా వాస్తవాలు తెలుసుకోవాలి.. దొంగ రాతలు రాస్తామంటే కుదరదు: విశాఖ కోర్టు వద్ద లోకేశ్
- తనపై అసత్య వార్తలు ప్రచురించారంటూ సాక్షి దినపత్రికపై లోకేశ్ పిటిషన్
- పత్రికపై రూ.75 కోట్లకు పరువు నష్టం దావా
- కేసు వాయిదాకు ఈ రోజు మరోసారి హాజరైన లోకేశ్
- తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే పరువు నష్టం దావా వేస్తానని వార్నింగ్
పలు మీడియా సంస్థలపైనా, వైసీపీ ప్రభుత్వంపైనా టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. తనపై అసత్య వార్తలు ప్రచురించారని ఆరోపిస్తూ సాక్షి దినపత్రికపై లోకేశ్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఆ పత్రికపై రూ.75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఈ నెల 24న కోర్టుకు హాజరైన లోకేశ్.. కేసు నేటికి వాయిదా పడడంతో మరోసారి నేడు హాజరయ్యారు.
ఈ సందర్భంగా విశాఖ కోర్టు వద్ద లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ.. పత్రికలు వాస్తవాలు తెలుసుకుని ప్రచురించుకోవాలని హెచ్చరించారు. దొంగ రాతలు రాస్తామంటే కుదరదని, తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. వైసీపీ పాలనలో రాష్ట్రానికి పెట్టుబడులు లేవని ఆయన అన్నారు. పక్క రాష్ట్రాలకు పెట్టుబడులు పోతున్నాయని ఆయన అన్నారు. రోడ్లపై గుంతలు పూడ్చలేని వారు రాజధాని నిర్మిస్తారా? అని ఆయన ప్రశ్నించారు.