Congress: గ్రాఫ్ తగ్గినందుకే కేసీఆర్‌కు ట్యూషన్ టీచర్: గీతారెడ్డి
- గ్రాఫ్ తగ్గిన కేసీఆర్ వీక్ అయ్యారు
- అందుకోసమే ట్యూషన్ టీచర్‌గా ప్రశాంత్ కిశోర్
- టీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గుతోంటే.. కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోంది
- మాజీ మంత్రి గీతారెడ్డి సెటైర్లు
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు వ్యూహాలు రచించి ఇచ్చేందుకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను కేసీఆర్ నియమించుకున్న వైనంపై కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో సెటైర్లు సంధిస్తోంది. ఇప్పటికే చేతకాకపోవడంతోనే ప్రశాంత్ కిశోర్‌ను కేసీఆర్ నియమించుకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇదే కోణంలో కేసీఆర్‌పై సెటైర్లు సంధించిన మాజీ మంత్రి గీతారెడ్డి.. కేసీఆర్‌పై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కేసీఆర్‌ను వీక్ అయిన స్టూడెంట్‌గా అభివర్ణించిన గీతారెడ్డి.. ప్రశాంత్ కిశోర్‌ను ట్యూషన్ టీచర్‌గా చెప్పుకొచ్చారు. అయినా మనం ట్యూషన్ టీచర్‌ను ఎందుకు పెట్టుకుంటామని ప్రశ్నించిన గీతారెడ్డి.. స్టూడెంట్ వీక్ అయితేనే కదా ట్యూషన్ చెప్పించేది అని వివరించారు. ఈ లెక్కనే గ్రాఫ్ భారీగా పడిపోయిన కారణంగా కేసీఆర్ వీక్ అయ్యారని, అందుకోసమే ప్రశాంత్ కిశోర్ లాంటి ట్యూషన్ టీచర్ కేసీఆర్‌కు అవసరమయ్యాడని చెప్పారు. టీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గుతోంటే.. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అంతకంతకూ పెరుగుతోందని గీతారెడ్డి చెప్పారు.