BJP: ఎన్నికలకు సిద్ధం.. సత్తా చాటుతాం: బండి సంజయ్
- బీజేపీ జోనల్ స్థాయి సమావేశాలు ప్రారంభం
- బెంగాల్లో బీజేపీకి 40 శాతం పెరిగాయన్న సంజయ్
- హైదరాబాద్లో 60 శాతం ఓట్లు తమవేనని వెల్లడి
- కేసీఆర్ భోగస్ సర్వేలను విడుదల చేస్తున్నారని ఆరోపణ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమేనని ప్రకటించిన బండి.. ఎన్నికల్లో సత్తా చాటుతామని కూడా చెప్పారు. హైదరాబాద్ బీజేపీ జోనల్ స్థాయి సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ ఈ నెల 6 నుండి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సదస్సులు నిర్వహించాలని నిర్ణయించామన్నారు.
ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో తమ పార్టీ ఏ రీతిన అభివృద్ధి చెందిందన్న విషయాన్ని బండి సంజయ్ వివరించారు. బీజేపీ కార్యకర్తలు చేసిన పోరాటాల వల్లే బెంగాల్ లో బీజేపీ ఓట్ల శాతం 40 శాతం దాటిందని చెప్పిన ఆయన.. గత ఎన్నికలతో పోలిస్తే తెలంగాణలో బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతోందన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
ఇక హైదరాబాద్ సిటీలో బీజేపీ ఓటు బ్యాంక్ 60 శాతానికి పెరిగిందన్న సంజయ్.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతైందన్నారు. ఈ దఫా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తెలియడంతో సీఎం కేసీఆర్ బోగస్ సర్వే ఫలితాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.