Congress: టీ కాంగ్రెస్‌కూ వ్యూహకర్త కావాల్సిందేనట!
- పీకే టీంలో పనిచేసిన సునీల్ కుమార్
- అతడి సేవలను వినియోగించుకోవాలంటున్న రేవంత్
- హుజూరాబాద్ బైపోల్లో అతడి వ్యూహాలు పనిచేయలేదట
- రేవంత్ ప్రతిపాదనను తిరస్కరిస్తున్న సీనియర్లు
ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలకు వ్యూహాలు రచించి ఇచ్చేందుకు రాజకీయ వ్యూహకర్తలు అవసరమవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, ఐప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ కోసం దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయి. పీకే టీంలో పనిచేసిన వారి సేవలైనా కావాల్సిందేనన్న రీతిలో పార్టీలు యోచిస్తున్నాయి. ఇందులో భాగంగా టీ కాంగ్రెస్‌కు కూడా ఓ వ్యూహకర్త కావాలంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. గతంలో పీకే టీంలో పనిచేసిన తమిళనాడుకు చెందిన సునీల్ కుమార్ సేవలను వినియోగించుకోవాలని ఆయన భావిస్తున్నారు.
అయితే రేవంత్ రెడ్డి ప్రతిపాదనను పార్టీ సీనియర్లు వ్యతిరేకిస్తున్నారని సమాచారం. ఎస్కేగా రాజకీయ పార్టీలకు చిరపరచితులే అయిన సునీల్ కుమార్ సేవలు టీ కాంగ్రెస్‌కు అవసరం లేదని, ఆయన ట్రాక్ రికార్డేమీ బాగా లేదని కూడా సీనియర్లు వాదిస్తున్నారట. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఆయన పనిచేసిన పార్టీకి పెద్దగా ఫలితం దక్కలేదని, అలాంటి వ్యూహకర్త పార్టీకి అవసరం లేదని కూడా వారు వాదిస్తున్నారట.