KCR: ఢిల్లీకి బయలుదేరిన కేసీఆర్.. 3 రోజుల షెడ్యూల్ ఫుల్ బిజీ
- అరవింద్ కేజ్రీవాల్‌తో తొలి సమావేశం
- ఆపై ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు
- పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం
- డిల్లీలో అందుబాటులో ఉండే ప్రాంతీయ పార్టీల అధినేతలతోనూ భేటీ
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాసేపటి క్రితం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సోమవారం రాత్రి బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరారు. మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్న కేసీఆర్.. మూడు రోజుల పాటు ఫుల్ బిజీగా గడపనున్నారు. మూడు రోజుల పర్యటనకు సంబంధించి స్పష్టమైన షెడ్యూలేమీ విడుదల చేయని కేసీఆర్.. ఢిల్లీలో సుడిగాలి పర్యటన చేయనున్నారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా తొలి రోజైన మంగళవారం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో కేసీఆర్ భేటీ కానున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా పలు పార్టీలతో కూటమి ఏర్పాటు చేసే దిశగా కదులుతున్న కేసీఆర్.. అందులో భాగంగానే కేజ్రీవాల్‌ను కలవనున్నట్లుగా సమాచారం. ఆ తర్వాత మంగళవారమే ఢిల్లీలోని ఎయిమ్స్‌కు వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇక రెండో రోజైన బుధవారం, మూడో రోజైన గురువారం పలువురు కేంద్ర మంత్రులతో కేసీఆర్ సమావేశం కానున్నట్లుగా సమాచారం. రాష్ట్ర విభజన హామీల అమలు, సమస్యల పరిష్కారం, తెలంగాణకు రావాల్సిన నిధులపై ఆయన కేంద్ర మంత్రులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక పలు రాష్ట్రాలకు చెందిన పార్టీల నేతలు ఎవరైనా ఢిల్లీలో అందుబాటులో ఉంటే వారితో కూడా కేసీఆర్ భేటీ అయ్యే అవకాశాలున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.