us: రష్యా కొమ్ము కాస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలి: బెలారస్ కు అమెరికా హెచ్చరిక
- ఉక్రెయిన్ పొరుగు దేశమే బెలారస్
- రష్యాకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్న బెలారస్
- పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయన్న అమెరికా
రష్యాకు ఏజెంట్ గా వ్యవహరిస్తూ, ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధానికి పరోక్ష సాయం అందిస్తున్న బెలారస్ దేశానికి అమెరికా గట్టి వార్నింగ్ ఇచ్చింది. తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించింది.
‘‘ఉక్రెయిన్ పై పుతిన్ దురాక్రమణకు లుకషెంకో తన మద్దతు ఇలాగే కొనసాగిస్తే బెలారస్ తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుంది’’ అంటూ అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైజ్ పేర్కొన్నారు.
ఉక్రెయిన్ పొరుగు దేశమే బెలారస్. అణు రహిత హోదా కలిగిన దేశం. కానీ, తాజా పరిణామాలతో ఈ హోదాను వదిలేసుకుంది. ఉక్రెయిన్ పై రష్యా అణ్వాయుధాలను తన భూభాగం నుంచి ఎక్కు పెట్టేందుకు అనుమతించింది. రష్యాకు మద్దతుగా ఉక్రెయిన్ పై బెలారస్ కూడా సైనిక చర్యకు దిగొచ్చని అమెరికా భావిస్తోంది. ఉక్రెయిన్-రష్యా మధ్య ఆదివారం చర్చలకు కూడా బెలారస్ వేదికగా నిలవడం గమనార్హం. దీంతో బెలారస్ తీరుపై అమెరికా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది.