Sanju Samson: 18, 19, 20 కాదు కావాల్సింది.. సంజూ శాంసన్ పై పాకిస్థాన్ క్రికెటర్ ఫైర్
- ప్రతిభ ఉంటే సరిపోదన్న సల్మాన్ భట్
- దానికి తగిన ఔట్ పుట్ కావాలని సూచన
- శాంసన్ మెరుగవ్వాలని కామెంట్
టీమిండియా ఆటగాడు సంజూ శాంసన్ పై పాకిస్థాన్ క్రికెటర్, మాజీ ఓపెనర్ సల్మాన్ భట్ మండిపడ్డాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ సందర్భంగా అవకాశం దక్కించుకున్న సంజూ.. వరుసగా 39, 18 పరుగులు చేశాడు. అయితే, టీంలో అవకాశం ఇచ్చింది ఈ పరుగులు చేయడానికి కాదంటూ సల్మాన్ భట్ విమర్శించాడు.
జట్టులో చోటు దక్కాలంటే అతడు మెరుగైన ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు. ‘‘సంజూ కొన్ని మంచి షాట్ లు ఆడాడు. అయితే, 18, 19, 20, 30 వంటి స్కోర్లు సరిపోవు. అతడి దగ్గర ప్రతిభ ఉన్నా.. సరైన ఔట్ పుట్ రావడం లేదు. జట్టులో స్థానం పదిలం కావాలంటే ప్రతిభ ఉంటే సరిపోదు. ఔట్ పుట్ కావాలి. అందుకు సంజూ తనను తాను మెరుగుపరచుకోవాలి’’ అని సూచించాడు.
ఇప్పటికే ఎంతో మంది యువ ప్లేయర్లు జాతీయ జట్టులో చోటుకు పిలుపు కోసం ఎదురు చూస్తున్నారని గుర్తు చేశాడు. కాబట్టి జట్టులో స్థానం నిలవాలంటే.. వారికి మించిన ప్రతిభ కనబరిచి ఔట్ పుట్ ఇవ్వడం ఆవశ్యకమన్నాడు.