Ukraine: లక్ష్యం చేరేవరకు వెనక్కు తగ్గేదే లేదు: రష్యా ప్రకటన
- ఉక్రెయిన్ నిస్సైనికీకరణ తొలి లక్ష్యం
- ఆ దేశం నుంచి నాజీ తత్వాన్ని పారదోలడం రెండో లక్ష్యం
- అప్పటిదాకా రష్యా సాయుధ దళాలు వెనక్కు రావు
- రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగువే ప్రకటన
ఉక్రెయిన్‌పై యుద్ధంలో లక్ష్యం చేరేదాకా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని రష్యా సంచలన ప్రకటన చేసింది. రష్యా నిర్దేశించుకున్నలక్ష్యం నెరవేరే దాకా ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపేదే లేదని ఆ దేశ రక్షణ మంత్రి సెర్గీ షోయిగువే ఓ కీలక ప్రకటన చేశారు. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేదాకా రష్యా సాయుధ దళాలు ప్రత్యేక సైనిక చర్యను కొనసాగిస్తాయని ఆయన ప్రకటించారు.
ఉక్రెయిన్‌ను నిస్సైనికీకరణ చేయడంతో పాటుగా ఉక్రెయిన్ నుంచి నాజీ తత్వాన్ని పారదోలడమే రష్యా లక్ష్యాలని కూడా సెర్గీ వెల్లడించారు. ఉక్రెయిన్‌ను నిస్సైనికీకరణ చేసేందుకు తాము సైనిక చర్యకు పాల్పడితే..అందుకు ప్రతిగా పాశ్చాత్య దేశాలు తమపై ఆంక్షలు విధిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసిన సెర్గీ.. పాశ్చాత్య దేశాల సైనిక ముప్పు నుంచి రష్యాను కాపాడుకోవడం కూడా తమ ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు. మొత్తంగా పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతు ఇచ్చినా..ఉక్రెయిన్‌లో తాను అనుకున్న పరిస్థితులు నెలకొనేదాకా యుద్దాన్ని ఆపేదేలేదని సెర్గీ రష్యా వైఖరిని వెల్లడించారు.