Ukraine: ఉక్రెయిన్, రష్యాల మధ్య రేపు రెండో విడత చర్చలు
- బెలారస్ కేంద్రంగా తొలి విడత చర్చలు
- ఎలాంటి ఫలితం ఇవ్వకుండానే ముగిసిన చర్చలు
- బుధవారం రెండో విడత చర్చలకు ఇరు దేశాల అంగీకారం
- బెలారస్ వేదికగానే రెండో విడత చర్చలు
ఓ వైపు హోరాహోరీగా యుద్ధం.. మరోవైపు చర్చలు.. రష్యా, ఉక్రెయిన్ల మధ్య సాగుతున్న తంతు ఇది. ఆరు రోజుల క్రితం ఉన్న పళంగా ఉక్రెయిన్‌పైకి దండెత్తి వచ్చిన రష్యా భీకర దాడులతో తెగబడుతోంది. ఆరు రోజులుగా సాగిస్తున్న యుద్ధాన్ని రష్యా అంతకంతకూ పెంచుకుంటూ పోతూనే ఉంది. రష్యా దాడులను తిప్పికొట్టేందుకు తన వద్ద స్వల్ప సాధన సంపత్తితోనే ఉక్రెయిన్ కూడా ఎదురొడ్డి నిలుస్తోంది. ఈ క్రమంలో చర్చలంటూ రష్యా ప్రతిపాదించగా..ఉక్రెయిన్ కూడా అందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే.
సోమవారం నాడు రష్యా మిత్ర దేశంగా భావిస్తున్న బెలారస్‌లో ఇరు దేశాల ప్రతినిధుల మధ్య తొలి విడత చర్చలు జరిగాయి. 3 గంటలకు పైగా జరిగిన ఈ చర్చల్లో ఇరు దేశాలు తమ తమ వాదనలకే కట్టుబడిన నేపథ్యంలో ఎలాంటి ఫలితం లేకుండానే చర్చలు ముగిశాయి. అలా సోమవారం అసంపూర్తిగా ముగిసిన చర్చలను పునఃప్రారంభించాలని ఇరు దేశాలు భావించాయి. ఈ మేరకు మరోమారు బెలారస్‌లోనే బుధవారం నాడు రెండో విడత చర్చలు జరపాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. మరి ఈ చర్చల్లో అయినా యుద్ధం ఆగే దిశగా నిర్ణయం వస్తుందా? అన్న అంశపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.