Telangana: ఒక్క రోజులో 5 లక్షల చలాన్ల క్లియర్.. రూ.5.5 కోట్ల ఆదాయం
- పెండింగ్ చలాన్ల క్లియరెన్స్‌కు భారీ రిబేట్ ప్రకటన
- తొలి రోజే 5 లక్షలకు పైగా చలాన్లు క్లియర్
- పోలీసు శాఖకు రూ.5.5 కోట్ల మేర ఆదాయం
- వాహనదారులు పోటెత్తడంతో ఈ-చలాన్ వెబ్ సైట్ డౌన్
తెలంగాణలో వాహనాల పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ వ్యవహారానికి తొలి రోజున (మంగళవారం) ఊహించని రీతిలో భారీ స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ చలాన్లు భారీ ఎత్తున పేరుకుపోగా.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లలో ఏకంగా రూ.600 కోట్ల పైచిలుకు విలువ కలిగిన చలాన్లు పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
వీటి సొమ్మును రాబట్టుకునేందుకు తెలంగాణ పోలీసు శాఖ భారీ రిబేట్‌తో చలాన్ల క్లియరెన్స్‌కు పిలుపునిచ్చింది. 30 శాతం మొదలు 80 శాతం దాకా రిబేట్ ప్రకటిస్తూ.. పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవాలంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ ఆఫర్‌కు వాహనదారుల నుంచి భారీ స్పందన లభించింది. ఈ నెల 1 నుంచి ఈ నెల 30దాకా గడువు విధించినా... తొలిరోజే వాహనదారులు తమ పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కోసం పోటెత్తారు. తొలిరోజు లక్ష నుంచి 3 లక్షల దాకా వాహనదారులు వస్తారని పోలీసు శాఖ భావించినా.. దానిని మించి ఏకంగా తొలి రోజే 5 లక్షలకు పైగా పెండింగ్ చలాన్లు క్లియర్ అయిపోయాయి.
దీంతో తొలిరోజే పోలీసు శాఖకు ఏకంగా రూ.5.5 కోట్ల మేర ఆదాయం లభించింది. ఒకేసారి వాహనదారులు పోటెత్తడంతో ఏకంగా ఈ-చలాన్ వెబ్ సైట్ క్రాష్ అయిపోయింది. దీంతో మరింత మంది వాహనదారులు తమ పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవాలనుకున్నా.. కుదరలేదు. నెలాఖరులోగా మొత్తం పెండింగ్ చలాన్లు క్లియర్ అయిపోయే అవకాశాలున్నట్లుగా పోలీసు శాఖ భావిస్తోంది.